ములుగు జిల్లాలో కుండపోత వర్షం..
పొంగిపొర్లుతున్న బోగత జలపాతం..
ములుగు జిల్లాలోని వాజేడులో కుండపోత వర్షం కురిసింది. వాజేడు మండలం పేరూరులో 30.4 మి.మీ వర్షపాతం నమోదైంది. బొగత జలపాతం పొంగిపొర్లుతూ జలకళ సంతరించుకుంది. ములుగు జిల్లా వెంకటాపురంలో కుండపోత వర్షం కురిసింది. భారీవర్షానికి రాళ్లవాగు వంతెన తాత్కాలిక దారికి కోత పడింది. వెంకటాపురం-భద్రాచలం ప్రధాన మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వెంకటాపురంలోని బీసీ బాలుర వసతిగృహాన్ని వరద చుట్టుముట్టింది. దీంతో విద్యార్థులు బయటకు రాకుండా హాస్టల్లోనే ఉన్నారు. మంగపేట మండలం మల్లూరు అత్తచెరువు తూము లీకైంది. భారీ వర్షాలకు ఇక్కడి రమణక్క పేటలో ఇల్లు కూలింది. తూము లీకవ్వడంతో మల్లూరు గ్రామంలోకి వరదనీరు చేరింది. ఏటూరునాగారంలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఇక్కడి వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాల్లోకి వరద నీరు చేరింది.