*పేదల ఇళ్లే లక్ష్యంగా టౌన్ ప్లానింగ్ కూల్చివేతలు*
నిజామాబాద్, సెప్టెంబర్ 26 (ప్రశ్న ఆయుధం ప్రతినిధి)
నగరంలోని పేదల ఇళ్లే లక్ష్యంగా నిజామాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారుల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో బడాబాబుల అక్రమ నిర్మాణాలపై మాత్రం అధికారులు కన్నెత్తి చూడకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
భారీ వర్షంలో హడావుడిగా కూల్చివేత
గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురుస్తున్న సమయంలో నాగారం ప్రాంతంలోని డిఎస్ కాలనీలో ఓ నిరుపేద కుటుంబం నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. అక్రమ కట్టడం అన్న నెపంతో తొలగింపు చర్యలు చేపట్టినప్పటికీ, వర్షంలో తడవనీయకుండానే ఈ తరహా చర్యలు తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అక్రమ నిర్మాణాలపై వేట ఎందుకు లేదు?
నగరంలోని సుభాష్ నగర్, ఆటోనగర్, సీఎం రోడ్, మాలపల్లి, సారంగాపూర్, వర్ని రోడ్ వంటి ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ భవనాల నిర్మాణాలు సాగుతున్నాయి. అనుమతులు రెండు అంతస్తులకు మాత్రమే తీసుకున్నా, ఐదు అంతస్తుల వరకు నిర్మాణాలు సాగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఓ మాజీ కార్పొరేటర్ వర్ని రోడ్డులో జి+1 అనుమతితో ఐదంతస్తుల భవనం నిర్మిస్తుండటం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఫిర్యాదులు చేసినా స్పందన లేదు
ఇలాంటి అక్రమ నిర్మాణాలపై పౌరులు ఫిర్యాదులు చేసినా, అధికారులు స్పందించకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మామూలు ప్రజల ఇళ్లపై మాత్రం హడావుడిగా చర్యలు తీస్తూ, బడాబాబుల అక్రమాలపై మౌనం పాటించడం వెనుక లంచాల ప్రభావమేనని ఆరోపణలు వస్తున్నాయి.
అవినీతిపై విచారణ అవసరం
ఇటీవలే మున్సిపల్ రెవెన్యూ విభాగంలో ఏసీబీ అధికారులు దాడులు జరిపి అవినీతి అధికారిని అరెస్టు చేసిన విషయం విదితమే. టౌన్ ప్లానింగ్ విభాగంలోనూ భారీ అవినీతి జరుగుతుందన్న ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో అధికారులు నిశిత దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం స్పందించాలి
నిజామాబాద్ టౌన్ ప్లానింగ్ శాఖలో అక్రమాలు, అవినీతిపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ వినయ్ కృష్ణారెడ్డి తక్షణమే దృష్టి సారించి, దోషులపై చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. పేదల కట్టడాలు మాత్రమే కాకుండా, బడాబాబుల అక్రమాలపైనూ కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు.