సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలని, రాహుల్ గాంధీ మాత్రమే దేశాన్ని ముందుకు నడిపగల నాయకుడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా అవ్వాలంటే తెలంగాణలో కనీసం 14 ఎంపీలు, ఆంధ్రప్రదేశ్‌లో 20 ఎంపీలు గెలిపించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తెలంగాణ అభివృద్ధితో పాటు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతాయని జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణలో పదేళ్లు కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్లు జగన్, చంద్రబాబులు ముఖ్యమంత్రులుగా ఉండి, కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇచ్చినా.. అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారు. ఈ విషయాన్ని రెండు రాష్ట్రాల ప్రజలు గమనించాలని అన్నారు. భారతదేశం సాఫ్ట్‌వేర్, ఐటీ రంగాల్లో అభివృద్ధి సాధించిందంటే దానికి రాజీవ్ గాంధీ కారణం అని, ఆయన వల్లే ఈనాడు కోట్లాది యువత ఉద్యోగాలు పొందుతున్నారని గుర్తు చేశారు. అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం హయాంలో ఉపాధి హామీ పథకం తీసుకువచ్చి గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించిందని తెలిపారు. ఈ పదేళ్ల బీజేపీ పాలనలో మహిళలకు ఉపాధి, యువతకు ఉద్యోగాలు, పేదలకు న్యాయం జరిగిందా..?” అని ప్రశ్నించారు. విదేశాల నుంచి నల్లధనం తెచ్చి, ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తానని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చిన మోడీని ప్రజలు ఎందుకు ప్రశ్నించడం లేదని అని మండిపడ్డారు. ఆనాడు ఇందిరా గాంధీ ప్రపంచ దేశాలను శాసిస్తే, ఈనాడు ప్రపంచ దేశాలు ప్రధాన మంత్రి మోడీని శాసిస్తున్నాయని విమర్శించారు. అదే విధంగా కేసీఆర్, జగన్, చంద్రబాబులు మోడీ నీడలో పాలన చేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. దేశం మారాలంటే 300 కాంగ్రెస్ ఎంపీలను గెలిపించి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని, మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి రాహుల్ గాంధీ మరియు ఆయన కుటుంబం అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.
దేశ భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
Published On: November 1, 2025 1:34 pm