మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 14 మందిపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. వీరిలో 13 మందికి భారీ జరిమానా విధించగా, ఒకరికి కోర్టు జైలు శిక్ష విధించింది.
ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న 14 మందిని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ ఎదుట హాజరుపరిచారు. కోర్టు విచారణ అనంతరం 13 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.1,30,000 జరిమానా విధించింది.
మద్యం మత్తులో వాహనం నడిపిన నవతె రాములు (59) అనే వ్యక్తికి కోర్టు ఒక వారం రోజుల జైలు శిక్ష విధించింది. రాములు వృత్తిరీత్యా డ్రైవర్ అని, నాందేవాడకు చెందిన వారని పోలీసులు తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తీవ్రమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.

