తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక"లో భాగంగా, జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు "అరైవ్ అలైవ్" రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఆరవ రోజును 'జీరో ఎన్ఫోర్స్మెంట్ డే'గా ప్రకటించి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించకుండా కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పించారు.
వికారాబాద్ పట్టణంలో, ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో 'హెల్మెట్ సార్' శ్రీ ధన్ శెట్టిని సన్మానించి, ఆయనను ఆదర్శంగా చూపిస్తూ వాహనదారులకు అవగాహన కల్పించారు. బషీరాబాద్, బంట్వారం, మార్పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్ఐలు రోడ్డు భద్రతా నియమాలు, గోల్డెన్ అవర్ ప్రాధాన్యత, డిఫెన్సివ్ డ్రైవింగ్‌పై వాహనదారులకు వివరించారు. స్కూల్ బస్సులు, ప్యాసింజర్ ఆటోల డాక్యుమెంట్లను తనిఖీ చేసి, సురక్షిత ప్రయాణంపై కౌన్సెలింగ్ నిర్వహించారు.
తాండూర్ టౌన్ ఇన్ స్పెక్టర్ ఆధ్వర్యంలో పాఠశాల బస్సు డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన సెషన్ నిర్వహించి, బస్సులలో ప్రథమ చికిత్స కిట్లు, స్పీడ్ గవర్నర్లు, ఫిట్ నెస్ సర్టిఫికెట్ల లభ్యతను పరిశీలించారు. చిన్నారుల రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు దిశానిర్దేశం చేశారు. బొంరాస్‌పేట్, ధరూర్, కోడంగల్ (NH 163), దౌల్తాబాద్ ప్రాంతాల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
దుద్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్లు, ప్రయాణికులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. చెంగోముల్, కుల్కచర్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో పాఠశాల విద్యార్థులకు రోడ్డు దాటే విధానం, జీబ్రా క్రాసింగ్ ప్రాధాన్యతను వివరించారు. పాఠశాల పరిసరాలను 'సురక్షిత పాఠశాల మండలాలు'గా మార్చి, వేగ నియంత్రణ బోర్డులు, జీబ్రా క్రాసింగ్లను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలందరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు సహకరించాలని తెలియజేశారు.










