ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్యుల బదిలీలను నిలుపుదల చేయాలిమేకల లత డిమాండ్*
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్సి జూలై 22
స్థానిక ఆదర్శనగర్ కాలనీ నందు మహాజన మహిళా సమైక్య ముఖ్య కార్యకర్తల సమావేశం ఎస్ కే సాల్మ అధ్యక్షతన సమావేశం సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మహాజన మహిళా సమితి జిల్లా అధ్యక్షురాలు మేకల లత పాల్గొని మాట్లాడుతూ భద్రాచలం ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలకు వైద్యం అందే పరిస్థితి కనిపించడం లేదని, పేదలకు అందుబాటులో ఉన్న ఏరియా హాస్పిటల్ వైద్యులను బదిలీలు చేయడం నిలుపుదల చేయాలని కోరారు. పేదలకు వైద్యం అందించే డాక్టర్లు లేక ఇబ్బంది పడుతుంటే ఉన్న డాక్టర్లను బదిలీలు చేయడం పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కనిపించడం లేదని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలు ఆరోగ్యాన్ని కొనుక్కునే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుందని,ప్రైవేట్ ,కార్పొరేట్ వైద్యశాలకు దాసోహమైన ప్రభుత్వం పేదల వైద్యాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆవేదన వ్యక్తపరిచారు. పేద ప్రజలకు అందాల్సిన వైద్య సదుపాయాలు సక్రమంగా అందించకుండా మెడికల్ మాఫియాని ప్రోత్సహిస్తుందని అన్నారు. భద్రాచలం ఏరియా హాస్పిటల్ నందు విధులు నిర్వహిస్తున్న డాక్టర్లను బదిలీ చేయడం పేదలకు వైద్యాన్ని దూరం చేయడమేనని అన్నారు. దూర ప్రాంతాల నుండి వస్తున్న పేద రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రత్యేక చొరచూపకుండా అకారణంగా వైద్యులను బదిలీ చేయడం అంటే పేద రోగులను బలవంతంగా చంపడమేనని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలకు ప్రభుత్వ వైద్యం దూరం చేయడమేనని గమనించి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ భద్రాచలంలో వైద్యులను అదనంగా నియమించి బదిలీలను నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా మహిళా సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు.