Site icon PRASHNA AYUDHAM

పొగ మంచులో ప్రయాణం ప్రమాదకరం: జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్

Oplus_131072

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): శీతాకాలంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరి, పొగమంచు దట్టంగా కమ్మేస్తుంటుందని, రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితులు ఏర్పడతాయని, ఈ సమయంలోనే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వాహనాల నుంచి వెలుపడే పొగ కారణంగా మంచు మరింత దట్టంగా కమ్ముకొని ఉదయం 8 గంటలైన రోడ్డు సరిగ్గా కనిపించకపోవడం వలన ఈ సమయాల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందన్నారు. వాహనానికి లైట్లు వేసుకున్నా.. కొంత దూరంలో ఉన్న వాహనాలు కూడా దగ్గరకు వచ్చే వరకు కనిపించవని, వేగంగా ప్రయాణం చేస్తే యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంటుందన్నారు. వాహనదారులు పరిమిత వేగంతో ప్రయాణిస్తే ప్రమాదాలు జరగకుండా నియంత్రించే అవకాశం ఉంటుందన్నారు. అధిక వేగంలో ఉన్న వాహనం సడన్‌ బ్రేక్‌ వేయడం వల్ల బోల్తా పడడం, ఇతర వాహనాలను ఢీకొట్టడం జరుగుతుందని, వాహనదారులు తక్కువ స్పీడ్‌లో ఉంటే ఎదురుగా వచ్చే వాహనాన్ని గుర్తించి, ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుదన్నారు. అందుకే చలికాలంలో డ్రైవింగ్‌ చేసేప్పుడు వాహనాల హెడ్‌లైట్లు, ఇండికేటర్లు వేసుకోవాడం శ్రేయస్కరం, అత్యవసరమైతే తప్ప, ప్రయాణాలు చేయకూడదని, పొగ మంచులో ప్రయాణాలకు దూరంగా ఉండాలన్నారు. ముఖ్యంగా రైతులు వరి ధాన్యం కుప్పలు రోడ్ల పై ఆరబెట్టకూడదు. రోడ్లపై రైతులు ధాన్యం కుప్పలు ఆరబోయడం ప్రమాదాలకు దారి తీస్తుందని, ధాన్యం కుప్పలు రోడ్లపై ఆరబోయడం వల్ల ఒకే దారిలో ఎదురెదురుగా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. రాత్రి పూట దారి వెంట అజాగ్రత్తగా ప్రయాణిస్తే ప్రమాదాలు తప్పవని వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని తెలిపారు. ధాన్యం కుప్పల కారణంగా ప్రమాదాలు జరిగితే సంబంధిత రైతులపై కేసులు నమోదు చేస్తామని సూచించారు. రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు పోతుంటే ఆ నష్టం పూడ్చలేనిదని రైతులు గుర్తుంచుకోవాలని అన్నారు. కావున రైతులు ఆలోచించి ధాన్యం కుప్పలను రహదారులపై పోయకుండా ధాన్యం ఆరబెట్టేందుకు కల్లాలను లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని జిల్లా ఎస్పీ రూపేష్ రైతులకు సూచించారు.

Exit mobile version