ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకోనున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్
* నెలకో జిల్లా చొప్పున పర్యటన
ప్రజా పాలన అందిస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. కొత్త ఏడాది నుంచి జనం మధ్యకు వెళ్లి వారి ఇబ్బందులు తీసుకొనేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రతి నెల ఒక జిల్లాను ఎంచుకొని పర్యటిస్తారు. ఆ జిల్లాలో వెనుకబడిన, గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపు చేసేలా ఏర్పాట్లు ఉండాలని తన కార్యాలయ అధికారులకి దిశానిర్దేశం చేశారు.
జిల్లాలోని సమస్యలు, ప్రజల స్థితిగతులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. రోజంతా ప్రజలతో మమేకమవుతారు.