టిటిడి పాలకమండలి తొలి సమావేశంలోనే ఆర్ఎస్ఎస్‌ అజెండా

టిటిడి
Headlines :
  1. “టిటిడిలో అన్యమత ఉద్యోగులపై నిర్ణయం: విఆర్ఎస్‌ లేదా బదిలీ”
  2. “ఆర్ఎస్ఎస్‌ అజెండా అమలుకు టిటిడి పాలకమండలి తొలి అడుగు”
  3. “గరుడ వారధి పేరు పునరుద్ధరణ: టిటిడి తాజా నిర్ణయాలు”
  4. “టిటిడిలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం: కొత్త పాలకమండలి ప్రకటన”
  5. “శ్రీవాణి ట్రస్టు రద్దు, అన్నదాన సేవల విస్తరణ: టిటిడి ప్రగతి”

అన్యమత ఉద్యోగులకు విఆర్ఎస్‌

ఒప్పుకోకపోతే ఇతర శాఖలకు బదిలీ

టిటిడి పాలకమండలి తొలి సమావేశంలోనే ఆర్ఎస్ఎస్‌ అజెండా

 తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)లో పనిచేస్తున్న అన్యమతస్తులకు విఆర్ఎస్‌ అమలు చేయాలని పాలకమండలి నిర్ణయించింది. టిటిడి నూతన పాలక మండలి తొలి సమావేశం అధ్యక్షులు బిఆర్‌ నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలోనే అన్యమతస్తుల అంశం చర్చకు వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండటంతో ఇతర శాఖల మాదిరే ఇక్కడా ఉద్యోగ నియమాకాలు జరిగాయి. రాజ్యాంగానికి అనుగుణంగా, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ దశాబ్దాల తరబడి ఉద్యోగాల్లో కొనసాగుతున్న వీరికి తాజా నిర్ణయం పిడుగుపాటు. ఈ నియామకాలను ఆర్ఎస్ఎస్‌, బిజెపిలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తరచు వివాదాస్పదం చేసేవి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమిలో బిజెపి కూడా భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్ఎస్ఎస్‌ అజెండాలో భాగమైన ‘టిటిడిలో అన్యమతస్తుల’ అంశం పాలకమండలి తొలి సమావేశంలోనే ప్రస్తావనకు వచ్చింది. ఆర్ఎస్ఎస్‌ కోరుతున్నట్లుగానే అన్యమతస్తులను టిటిడి నుండి సాగనంపాలని నిర్ణయించారు. పాలకమండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఛైర్మన్‌ బిఆర్‌ నాయుడు టిటిడిలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులతో మాట్లాడి విఆర్ఎస్‌కు ఒప్పిస్తామని చెప్పారు. ఇందుకు ఒప్పుకోకపోతే వారిని ఇతర శాఖలకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. అన్యమత ఉద్యోగులు ఎంతమంది ఉన్నదీ లెక్కలు తీస్తున్నామని చెప్పారు. సామాన్య సందర్శకులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేలా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తీసుకురానున్నామని, దీనిని ఎలా చేయాలనే దానిపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. శ్రీనివాస సేతు పేరును తిరిగి గరుడ వారథిగా మార్పు చేస్తున్నట్లు చెప్పారు. అలిపిరి వద్ద టూరిజం కార్పొరేషన్‌ ద్వారా ‘దేవలోక్‌’ ప్రాజెక్టు (ప్రస్తుతం ముంతాజ్‌ హోటల్‌ నిర్మాణమవుతున్న స్థలం)కు కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీససుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధమని, దీనిని ఉల్లంఘిస్తే కేసులు పెడతామని తెలిపారు. స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు. ‘శ్రీవాణి’ ట్రస్టును రద్దు చేసి వేరే ట్రస్టులో విలీనం చేస్తామని తెలిపారు. నిత్యాన్నదానాన్ని మరింత మెరుగుపరిచేలా మెనూలో మరిన్ని ఆహార పదార్థాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. టిటిడిలోని 17,400 శాశ్వత ఉద్యోగులకు, 7,530 కాంట్రాక్టు ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం పది శాతం పెంచి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. తద్వారా రెగ్యులర్‌ ఉద్యోగులకు రూ.15,400, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు రూ.7,535 చొప్పున అందుతుందని చెప్పారు. శారదా పీఠానికి ఇచ్చిన స్థలాన్ని రద్దు చేసి టిటిడి స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. టూరిజం టికెట్ల కేటాయింపులో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణల నేపథ్యంలో తాత్కాలికంగా ఈ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. విచారణ అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అన్నదాన కేంద్రంలో రెండు లక్షల మందికి అన్నప్రసాదం వితరణ చేస్తామని చెప్పారు. నూతన పరికరాలు అమర్చి, ఆధునీకరణకు టివిఎస్‌ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. విలేకర్ల సమావేశంలో టిటిడి ఇఒ శ్యామలరావు పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment