ప్రధానోపాధ్యాయుడిపై దాడి చేసిన దుండగులను అరెస్టు చేయాలి: టీటీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.ప్రసాద్*

సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): తుక్కుగూడ జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు రాములుపై దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని టీటీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు తెలంగాణ టీచర్స్ యూనియన్ సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సంగారెడ్డి, సదాశివపేట, పుల్కల్, జహీరాబాద్, న్యాల్కల్ తదితర మండల పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలల్లో టీటీయూ జిల్లా, రాష్ట్ర నాయకులు ప్రసాద్, మొగులయ్య, శంకర్, రాములు, కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రధానోపాధ్యాయుడు రాములుపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డ వ్యక్తులను నెలరోజులు గడుస్తున్నా.. అరెస్టు చేయకపోవడం అన్యాయమని, పాఠశాలల్లో పని ప్రదేశాల్లో ఉపాధ్యాయులకు రక్షణ లేకుండా పోతుందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఉపాధ్యాయుడిని అవమానానికి గురి చేసి, దాడి చేసిన దుండగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని, పాఠశాలల్లో ఇతరులు అనుమతి లేకుండా ప్రవేశించి ఉపాధ్యాయులతో కలవడానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మొగులయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు యం.శంకర్, జిల్లా కోశాధికారి రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు యం.కోటేశ్వర్, వివిధ మండలాల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now