రెండు రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు ప్రైవేటు ఉద్యోగుల నుంచి రూ.3.81 కోట్లను సైబర్ నేరస్థులు దోచుకున్నారంటూ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఏపీఆర్ లగ్జూరియాకి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఫేస్‌బుక్‌లో 45 రోజుల క్రితం స్టాక్ మార్కెట్ పేరిట ఉన్న ఓ ప్రకటన చూసి క్లిక్ చేశాడు. దీంతో అతడు సైబర్ నేరస్థులు క్రియేట్ చేసిన ఒక వాట్సాప్ గ్రూప్‌లో సభ్యుడిగా మారాడు. అనంతరం పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని వారు సూచించడంతో పెట్టుబడి పెట్టాడు. వారు ఒక పోర్టల్ క్రియేట్ చేసి వచ్చిన లాభాలు అంటూ అందులోనూ చూపించారు. ఇలా 22 దఫాలుగా రూ.2.4 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు. తనకు వచ్చిన లాభాలు, పెట్టిన పెట్టుబడి తిరిగి ఇవ్వాలంటూ కోరడంతో సైబర్ నేరస్థులు స్పందించలేదు. చివరికి మోసపోయానని గ్రహించి తొలుత సైబర్ క్రైమ్ పోలీసులకు, అనంతరం పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.మరొక కేసులో యూట్యూబ్‌లో స్టాక్ మార్కెట్ ప్రకటన చూసి క్లిక్ చేయడంతో మరో వ్యక్తి కూడా వాట్సాప్ గ్రూపులో సభ్యుడిగా మారాడు. నెల రోజులుగా రూ.66.75 లక్షల పెట్టుబడి పెట్టాడు. తనకు వచ్చిన లాభాలు, పెట్టుబడి తిరిగి ఇవ్వాలని కోరితే వారు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించి అతడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..