ఎల్లారెడ్డి, అక్టోబర్ 15 (ప్రశ్న ఆయుధం):
ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామ శివారులో ఈ రోజు మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన పండుగ లక్ష్మణ్ (36), బాన్సువాడలో కూలీ పని చేసుకొని, తన హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌పై స్వగ్రామం వెల్లుట్లకు వస్తుండగా, వెంకటాపూర్ శివారులోని బంగారు మైసమ్మ గుడి దగ్గర బైక్ అదుపు తప్పి ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు తగిలిన లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆరు నెలల క్రితం బ్రెయిన్ ట్యూమర్ కారణంగా భార్య పండుగ లత (35) ను కోల్పోయిన అతను, ఇప్పుడు తానే మరణించడంతో, 11 ఏళ్ల కుమారుడు విగ్నేశ్వర్ మరియు 7 ఏళ్ల కూతురు దివ్యశ్రీ, వృద్ధ తల్లి మాత్రమే మిగిలడంతో ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
గ్రామస్తులు చిన్న పిల్లల పరిస్థితిని తెలుసుకుని వారి భవిష్యత్తు పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎల్లారెడ్డి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.