సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా యూజీసీ గైడ్ లైన్స్

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా యూజీసీ గైడ్ లైన్స్

– వర్సీటీల స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేసే కుట్రలు

– ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి సభ్యులు రఘురాం

– రాష్ట్రాల హక్కులను కాల రాసే నిర్ణయాలు

– యూజీసీ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలి

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థని, కేంద్రం తన సొంత ఎజెండాను వర్సీటీలలో అమలుపరిచేందుకు కుట్రలు చేస్తుందని, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ తీసుకువచ్చిన యూజీసీ నూతన మార్గదర్శకాలు రాజ్యంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వెంటనే దీనిని ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి సభ్యుడు రఘురాం అన్నారు.

మంగళవారం కామారెడ్డి డిగ్రీ కాలేజ్ ముందు ఏఐఎస్ఎఫ్ ఏర్పాటు చేసిన విలేకరులో సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి సభ్యుడు రఘురాం మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థను దెబ్బతీసే విధంగా పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దానిలో భాగమే విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తూ జాతీయ విద్యా విధానం పేరుతో విద్య కాషాయికరణకు పూనుకున్నారని ఆరోపించారు. సంస్కరణల పేరుతో ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందన్నారు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల ఆచార్యుల నియామకాలు, పదోన్నతి కోసం కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల పరిరక్షణ పేరిట యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) జనవరి 6న ముసాయిదా డ్రాఫ్ట్‌ను విడుదల చేసిందని, విద్యలో కేంద్ర, రాష్ట్రాల అధికారాల విషయంలో రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నప్పటికీ దాని స్ఫూర్తికి విరుద్ధంగా ఈ ముసాయిదా ప్రతిపాదనలు ఉంటూ రాష్ట్రాల హక్కులను, నిర్ణయాధికారాన్ని బలహీన పరుస్తూ మొత్తంగా ఫెడరల్‌ స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ రాజ్యాంగ మూల సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని మండిపడ్డారు. పూర్తిగా గవర్నర్ చేతిలో వీసీల నియామకాలు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఇప్పటి వరకూ వైస్‌ ఛాన్సలర్‌ (వీసీ)ల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో సెర్చ్‌ కమిటీ వేస్తూ వస్తోందని, ఈ కమిటీలో ముగ్గురు సభ్యులు యూజీసీ ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదించిన సభ్యుడు, యూనివర్సిటీ కౌన్సిల్‌ ప్రతినిధి ఉంటున్నారని, ఈ సెర్చ్‌ కమిటీ సీనియారిటీ, అర్హతలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ముగ్గురు పేర్లను సూచిస్తుంది. ఆ ముగ్గురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు పంపుతుందని, ఆ ముగ్గురిలో ఒకరిని గవర్నర్‌ వీసీగా ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడు యూజిసి 2025 సవరించిన నియమాలు వైస్‌ ఛాన్సలర్ల ఎంపికలో రాష్ట్ర గవర్నర్లకు ఎక్కువ అధికారాన్ని ఇస్తున్నాయని, ఇది అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఈ యూజీసీ ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర యూనివర్సిటీలు రాష్ట్ర అసెంబ్లీ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడతాయని రాష్ట్ర ప్రభుత్వమే యూనివర్సిటీలకు నిధులు కేటాయిస్తుందని కానీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ల ను నియమించి ఆర్ఎస్ఎస్ భావజాలానికి చెందిన వారిని ప్రొఫెసర్లుగా రిపోర్టు చేయడానికి కుట్రలు చేస్తున్నారని దీనిని రాష్ట్ర ప్రభుత్వాలు గమనించి వ్యతిరేకించాలని వారు అన్నారు. యూజీసీ ముసాయిదా ప్రతిపాదనలు ఉన్నత విద్యలో పూర్తిస్థాయి కార్పొరేట్‌ సంస్కృతిని చొప్పిస్తుందని అలాగే ఉపాధ్యాయులకు నిర్దిష్ట బోధన సమయం ప్రస్తావించలేదని, ‘నెట్‌’ అవసరం లేకుండా ‘మాస్టర్స్‌ డిగ్రీ’ ఉంటే చాలు అంటూ 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ సాధించిన వారిని యూజీసీ–నెట్‌లో అర్హత సాధించకపోయినా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నేరుగా నియమించుకోవచ్చని పేర్కొనడం బాధాకరమని అన్నారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేంద్రం ఒకొక్కటిగా తన అధీనంలోకి తీసుకుంటూ రాష్ట్రాలపై తన విధానాలను బలవంతంగా రుద్దుతోందని దుయ్యబట్టారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ వంటి అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వాలు గవర్నర్‌లతో వీసీల నియామకం పై వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాయని, ఆ రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని కేంద్రంపై, యూజీసీ వత్తిడి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కామారెడ్డి జిల్లా కన్వీనర్ శివప్రసాద్,నాయకులు నవీన్ కృష్ణ, గణేష్ ,నవీన్ పవన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now