Site icon PRASHNA AYUDHAM

వాహనదారులకు కేంద్రం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్‌ ఆఫర్‌!ఏడాదికి మూడు వేల టోల్‌ ఫీజు..

IMG 20250416 WA0960

*వాహనదారులకు కేంద్రం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్‌ ఆఫర్‌!ఏడాదికి మూడు వేల టోల్‌ ఫీజు..*

రహదారులపై టోల్‌ వసూలును మరింత సులభతరం చేయడంలో భాగంగా కేంద్రప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తున్నది.

టోల్‌ చార్జీలలో సగటున 50 శాతం వరకు రాయితీ కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా రూ.3 వేలు చెల్లించి ఏడాది పాటు టోల్‌ రుసుం చెల్లించకుండా ప్రయాణించేలా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తున్నది.

ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించిన కార్లు ఏడాది పాటు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలతో పాటు రాష్ట్ర రహదారులపై కూడా ఎంచక్కా చక్కర్లు కొట్టవచ్చు.

ఈ మొత్తాన్ని ఫాస్టాగ్‌ అకౌంట్‌ నుంచి చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, కాలపరిమితి ముగియనున్న టోల్‌ బూత్‌ల సంఖ్యను కూడా తగ్గించే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే, దీనికి రోడ్లు, రహదారులు నిర్మించిన కాంట్రాక్టర్లు, సంస్థలతో ముందుగా చేసుకున్న ఒప్పందాలు ఈ పాలసీ అమలుకు అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ అడ్డంకి అధిగమించేందుకు సదరు సంస్థలు, ఏజెన్సీలతో కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖాధికారులు రెండుసార్లు చర్చలు జరిపినట్టు సమాచారం. అంతేకాదు, ఈ పథకం పరిధిలోకి రావాలని రాష్ర్టాలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

మే 1 నుంచి శాటిలైట్‌ టోల్‌ సిస్టమ్‌!

ఇకపై టోల్‌ప్లాజాల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదు. గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన కష్టాలు కూడా తీరనున్నాయి. టోల్‌ ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు మే 1 నుంచి శాటిలైట్‌ ఆధారిత టోల్‌ విధానాన్ని కేంద్రప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్నది. ఈ విధానాన్ని మొదట కొన్ని రూట్లలో అమలు చేయనున్నారు.

Exit mobile version