శ్రీలంక ఎన్‌పిపి అపూర్వ విజయం

 శ్రీలంక ఎన్‌పిపి అపూర్వ విజయం

నవంబరు 20 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం

శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ (ఎన్‌.పి.పి) చారిత్రాత్మక విజయం సాధించింది. మొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ దామాషా ప్రాతినిధ్య పద్ధతిలో మూడింట రెండు వంతుల మెజార్టీ సాధించింది. 61.6 శాతం ఓట్లు తెచ్చుకున్న ఎన్‌.పి.పి సభలోని 225 స్థానాల్లోనూ 159 పొందగలిగింది. 2020లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌.పి.పి కేవలం మూడు సీట్లు మాత్రమే తెచ్చుకున్నదనే వాస్తవాన్ని గుర్తుచేసుకుంటే ఇదెంత అసాధారణ విజయమో అర్థమవుతుంది. లోగడ ఎన్‌.పి.పి అభ్యర్థి అనూర కుమార దిసనాయకే 42 శాతం ఓట్లు తెచ్చుకుని రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత శ్రీలంక అధ్యక్షుడుగా ఎన్నికైనారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన దిసనాయకే పార్లమెంటును రద్దు చేయడంతో నవంబరు 14న ఎన్నికలు జరిగాయి.

 

అన్ని తరగతుల మద్దతు

2019లో ఏర్పడిన ఎన్‌.పి.పిలో మార్క్సిస్టు పార్టీ అయిన జనతా విముక్తి పెరుమన (జెవిపి) మరో ఇరవై ఇతర రాజకీయ పార్టీలూ, ట్రేడ్‌ యూనియన్లు, సామాజిక బృందాలు వున్నాయి. జె.వి.పి నాయకుడైన దిసనాయకే ఎన్‌.పి.పి నేతగా వున్నారు. దిసనాయకే, ఎన్‌.పి.పి ఎన్నికల్లో విజయం సాధించడం శ్రీలంక రాజకీయాల్లో సంచల నాత్మకమైన మార్పుకు సంకేతంగా వున్నాయి. సమాజంలో కులీన వర్గాలనూ కుటుంబాల ప్రయోజనాలను కాపాడే రాజపక్షే ఎస్‌.ఎల్‌.పి.పి, ముక్కలైన ఎస్‌.ఎల్‌.ఎప్‌.పి, రణిల్‌ విక్రమ సింఘే పూర్వ యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యు.ఎన్‌.పి) అన్నీ ఎన్నికల్లో దెబ్బతిన్నాయి. సజిత్‌ ప్రేమదాస నాయకత్వంలోని ఎస్‌.జె.బి మాత్రమే 40 స్థానాలు తెచ్చుకుని పార్లమెంటులో నిలవగలిగింది. 22 ఎలక్టోరల్‌ జిల్లాలలోనూ ఎన్‌.పి.పి 21 తెచ్చుకోగలిగింది. తమిళ జిల్లాలైన జాఫ్నా, వాన్ని లలో ఇలంకై తమిళ్‌ అరసు కచ్చి (ఐ.టి.ఎ.కె)ను ఓడించి ఎన్‌.పి.పి గెలుపొందడం అన్నిటికన్నా ప్రముఖంగా చెప్పుకోవలసిన ఫలితం. ముస్లిం జనాభా గణనీయంగా వున్న అంపారా, ట్రింకోమలై లలో కూడా ఎన్‌.పి.పి నే ఆధిక్యత సాధించింది. దక్షిణ జిల్లాలను తుడిచిపెట్టడమే గాక తమిళజాతి తోట కార్మికులు గణనీయంగా వుండే మధ్య ప్రాంతాలలో కూడా అదే మంచి ఫలితాలు తెచ్చుకుంది. ఆ విధంగా జాతి, మత తేడాలకు అతీతంగా సమాజంలోని అన్ని తరగతుల నుంచి ఎన్‌.పి.పి మద్దతు పొందగలిగింది.

 

ఎన్‌.పి.పి ఆవిర్భావ నేపథ్యం

శ్రీలంకను కుదిపేసిన 2022 ఆర్థిక సంక్షోభం అరగాలయ ప్రజా వెల్లువకు దారితీసింది. ఆ సమయంలోనే ఎన్‌.పి.పి, జె.వి.పి ప్రజా మద్దతు పైకి ఎగబాకింది. రాజపక్షే వంశం ఆధ్వర్యంలో దేశాన్ని దోచుకున్న అవినీతికర రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చిన తిరుగుబాటే ఆ వెల్లువ. ఆ తిరుగుబాటు నుంచే ఎన్‌.పి.పి ఆవిర్భవించింది. ఎందుకంటే రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా ప్రజల ఆర్థిక హక్కులు, జీవనోపాధి కోసం జరిగిన పోరాటానికి అగ్రభాగాన నిలిచి నాయకత్వం వహించింది ఎన్‌.పి.పి నే. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన కళంకిత అవినీతి నేతలకు వ్యతిరేకంగా అనుర దిసనాయకే ప్రజల ఆకాంక్షలలో కీలకంగా దృష్టినాకర్షించగలిగారు. రాజ్యాంగ రాజకీయ సంస్కరణలు తీసుకురావడం, ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేయడం జరగాలంటే దిసనాయకే, ఎన్‌.పి.పి పార్లమెంటులో స్పష్టమైన ఆధిక్యత సంపాదించుకోవడం తప్పనిసరి. పార్లమెంటులో మెజార్టీ లేకపోతే అధ్యక్షుడు దిసనాయకే చేతులు కట్టేసిన పరిస్థితే వుండేది. ఇప్పుడు పార్లమెంటులో ఎన్‌.పి.పి కి సూపర్‌ మెజార్టీ వచ్చింది గనక నిజమైన పరిపాలనా ప్రక్రియ మొదలు పెట్టొచ్చు. హరిణి అమర సూర్య ప్రధాన మంత్రిగా 21 మందితో క్యాబినెట్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

 

ప్రత్యామ్నాయ మార్గం దిశగా…

తాను అమలు చేసే విధానాల సమగ్ర స్వరూపం ఏమిటో పార్లమెంటు ఎన్నికల ముందు దిసనాయకే ప్రకటించలేదు. ఇప్పుడు వాటిని రూపొందించవచ్చు. అధిక ధరలు జీవన వ్యయం పెరుగుదలతో అల్లాడుతున్న ప్రజలకు ఆర్థికంగా ఉపశమనం కలిగించడం, అవినీతిని, దండగమారి ఖర్చులను నివారించడం, గల్లంతైన ప్రజా ధనాన్ని తిరిగి రాబట్టడం, పౌర స్వేచ్ఛలు ప్రజాస్వామిక హక్కులు పునరుద్ధరించడం ప్రధాన ఎజెండాగా వుంటుంది. అధ్యక్ష తరహా విధానానికి స్వస్తి చెప్పేలా నూతన రాజ్యాంగం తీసుకు వస్తామని కూడా ఎన్‌.పి.పి వాగ్దానం చేసింది. తక్షణం చూస్తే ప్రభుత్వం ముందు మూడు సవాళ్లు వున్నాయి. ఐ.ఎం.ఎఫ్‌ నుంచి శ్రీలంక 2900 కోట్ల డాలర్ల అప్పు తీసుకుంది. ప్రజలపై కఠోర షరతులు విధించి ఇందులో రెండు విడతల చెల్లింపు పూర్తి చేసింది. వీటిలో కొన్ని షరతుల సడలింపు తీసుకొచ్చి ప్రజలకు ఉపశమనం కలిగిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నయా ఉదారవాద విధానాల ఊబిలో చిక్కుకుపోయిన శ్రీలంక ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారులు నుంచీ పశ్చిమ దేశాల ప్రభుత్వాల నుంచి బెదిరింపులకు గురి చేయబడే బలహీన స్థితిలో వుంది. ఈ నేపథ్యంలో వాటి నుంచి బయిటపడేలా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఎన్‌.పి.పి ప్రభుత్వం స్పష్టతతో సారథ్యం వహించాల్సి వుంటుంది. ప్రజానుకూల అభివృద్ధి విధానాలను రూపొందించ వలసి వుంటుంది.

 

దక్షిణాసియా దేశాలకు ప్రేరణ

ఇటు తన పొరుగున వున్న పెద్ద దేశమైన ఇండియాతో సన్నిహిత సంబంధాలు పాటిస్తూ మరోవైపు సంక్లిష్టమైన అంతర్జాతీయ రాజకీయ పరిస్థితిలో నావను నడిపించాల్సిన ప్రాధాన్యత ఏమిటో ఎన్‌.పి.పి నాయకత్వానికి గమనంలో వుంది. తమిళులు, ముస్లిం మైనార్టీల నుంచి గణనీయమైన మద్దతు పొందిన ఎన్‌.పి.పి వారి హక్కుల రక్షణకు భరోసా కల్పించేందుకై సానుకూల ప్రాతిపదిక ఏర్పరచి, అధికార చట్రంలో సముచిత వాటా ఇవ్వాలి. రాజ్యాంగ మార్పులు రాజకీయ వ్యవస్థలో మార్పుల ద్వారా దీన్ని సాధించడమెలాగో చూసుకోవాలి.

భారత దేశంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న వామపక్ష ప్రజాతంత్ర సంఘటనతో సమానమైనది ఎన్‌.పి.పి. అలాంటి ఒక వామపక్ష ప్రజాతంత్ర వేదిక శ్రీలంక అధ్యక్ష స్థానంలోకి రావడం దక్షిణాసియా రాజకీయ చరిత్రలో మైలురాయి. మత, జాతి పరమైన ఘర్షణలతో ద్రవ్య పెట్టుబడి దోపిడీకి కార్పొరేట్‌ లూటీతో ఛిద్రమైపోతున్న దక్షిణాసియా దేశాలకు…శ్రీలంకలో వామపక్షం సాధించిన బ్రహ్మాండమైన విజయం ప్రోత్సాహకరమైన హర్షణీయ పరిణామం.

 

(నవంబరు 20 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

Join WhatsApp

Join Now