అర్హత లేని వైద్యులు… అనుమతిలేని ఆసుపత్రులు..!!

అర్హత లేని వైద్యులు… అనుమతిలేని ఆసుపత్రులు..?

ప్రజల ప్రాణాలతో ఆటలు…!

ప్రైవేట్ ఆసుపత్రుల్లో “అర్హత లేని వైద్యం”..!!

ఇది వైద్యం లేదా వ్యాపారం..?

సీక్రెట్ రిపోర్ట్స్, సైలెంట్ అధికారులు..!!

25 మంది నకిలీ డాక్టర్లు గుర్తించి ఐఎంఏ ఇచ్చిన జాబితా ఎక్కడ..?

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎంబీబీఎస్ చేసినంత మాత్రాన స్పెషలైజేషన్ లేకుండా “కలరింగ్ డాక్టర్లు” పేరుతో వైద్యం చేస్తున్నారు. ఇటీవల ఒక ఆసుపత్రిలో రోగి గురక సమస్యతో చేరి మృతి చెందిన ఘటన, ఆరు నెలల్లో నలుగురు చిన్నారుల మరణాలు ప్రజల్లో ఆగ్రహం రేపాయి. ఓ వైద్యునిపై తీవ్ర ఆరోపణలు వచ్చినప్పటికీ, కేవలం ఆరు నెలల సస్పెన్షన్‌తో తప్పించుకోవడం వైద్య ఆరోగ్య శాఖ పని తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. తాజాగా టాస్క్‌ఫోర్స్ బృందం జిల్లాలో పలు ప్రైవేట్ ఆసుపత్రులపై తనిఖీలు జరిపి, ఓ ఫెర్టిలిటీ సెంటర్‌లో స్కానింగ్ గది సీజ్ చేయడంతో పాటు అనేక లోపాలను గుర్తించింది. అయితే ఈ తనిఖీల వివరాలను డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం సీక్రెట్‌గా ఉంచడం ప్రజల్లో అనుమానాలు కలిగిస్తోంది.

ఇదే విషయంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ, అధికారుల తీరు మాత్రం మారకపోవడం గమనార్హం. ఐఎంఏ ఇప్పటికే 25 మంది అనర్హ వైద్యులను గుర్తించి జాబితా పంపినప్పటికీ, శాఖ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయిందో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

సంగారెడ్డిలో “అర్హత లేని వైద్యులు – అప్రజాస్వామ్య ఆసుపత్రులు” అనే చీకటి వాస్తవం వెలుగులోకి వస్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అధికారులు సైలెంట్‌గా ఉండటం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య రంగం ప్రక్షాళన కావాలంటే కఠిన చర్యలు తప్ప వేరే మార్గం లేదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ప్రైవేటు ఆసుపత్రిలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment