Site icon PRASHNA AYUDHAM

వాణ్ని వదిలేది లేదు.. వంగలపూడి అనిత వార్నింగ్..!

వంగలపూడి
Headlines in Telugu
వాంగలపూడి అనిత: “చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు”
చిన్నారిపై అత్యాచారం: “ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటోంది”

తిరుపతి జిల్లా వడమాలపేటలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. చిన్నారి చిత్రపటానికి నివాళులు అర్పించిన హోం మంత్రి వంగలపూడి అనిత.. అనంతరం బాధితురాలి కుటుంబసభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం తరుఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వంగలపూడి అనిత.. చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పండగని ఇంటికి వస్తే తాగిన మద్యం మత్తులో ఇలా చేశారంటూ వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు.

చాక్లెట్ కొనిస్తానని అత్యాచారం చేసి హత్యచేయడం బాధేసిందన్న వంగలపూడి అనిత.. ఈ ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోందన్నారు. తాగిన మత్తులో తల్లికి, చెల్లికి తేడా తెలియదా అంటూ వంగలపూడి అనిత ఎమోషనల్ అయ్యారు. చిన్నారి కనిపించడం లేదని 100కు ఫోన్ వచ్చిందన్న హోంమంత్రి.. పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకున్నారన్నారు. అయితే చిన్నారిని మాత్రం ప్రాణాలతో కాపాడలేకపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక కోర్టు ద్వారా నిందితుడికి మూడు నెలల్లోనే శిక్ష పడేలా చూస్తామన్నారు. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని.. సొంత ఇంటిని నిర్మించి ఇస్తామని హోంమంత్రి చెప్పారు.

మరోవైపు గడిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని వంగలపూడి అనిత ఆరోపించారు. చిన్నారి ఘటనను రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్న మంత్రి..ఎక్కడ ఘటన జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోందన్నారు. చిన్నపిల్లల మరణాల్ని కూడా రాజకీయం చేయడం బాధాకరమని అన్నారు. అనవసరంగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్న మంత్రి.. పులివెందులలో మహిళపై అత్యాచారం జరిగితే వైఎస్ జగన్ ఎందుకు నిందితుడిని శిక్షించలేదని ప్రశ్నించారు.

చంద్రబాబును విమర్సించే అర్హత జగన్‌కు లేదన్న వంగలపూడి అనిత.. జగన్ చేష్టలను దేవుడు కూడా క్షమించడని అన్నారు. మద్యంపై రోజా చేస్తున్న రాద్ధాంతం హాస్యాస్పదంగా ఉందన్న వంగలపూడి అనిత.. వైసీపీ హయాంలో మద్యం ఏరులై పారినప్పుడు ఈ విషయం గుర్తులేదా అంటూ ప్రశ్నించారు.

Exit mobile version