మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ.. అగ్రనేత వేణుగోపాల్ లొంగుబాటు
పోలీసులకు లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు వేణుగోపాల్ రావు
ఆయనతో పాటు మరో 60 మంది కూడా లొంగుబాటు
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసుల ఎదుట హాజరు
పార్టీ విధానాలతో విభేదాల వల్లే ఈ నిర్ణయమని సమాచారం
దివంగత నేత కిషన్‌జీకి వేణుగోపాల్ స్వయానా సోదరుడు
మావోయిస్టు పార్టీకి అత్యంత కీలకమైన కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరోలో సభ్యుడిగా ఉన్న అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోనూ పోలీసులకు లొంగిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆయన తన అనుచరులు 60 మందితో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమానికి ఊహించని షాక్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు.
గత కొంతకాలంగా పార్టీ అనుసరిస్తున్న విధానాలతో వేణుగోపాల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. విప్లవోద్యమాన్ని విజయవంతం చేయాలంటే ప్రజల్లోకి బహిరంగంగా వెళ్లడమే సరైన మార్గమని ఆయన భావించినట్లు సమాచారం. ఇదే విషయంపై పార్టీకి ఆయన రాసిన ఓ లేఖ తీవ్ర కలకలం రేపింది. కొన్ని రోజుల క్రితం, దివంగత మావోయిస్టు నేత, తన సోదరుడైన మల్లోజుల కోటేశ్వరరావు (కిషన్‌జీ) పేరుతో రాసిన మరో లేఖలో కూడా ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలోనే తాను పార్టీ నుంచి శాశ్వతంగా వైదొలగుతున్నట్లు వేణుగోపాల్ ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీలో ఇకపై కొనసాగలేనని స్పష్టం చేస్తూ ఆయన మావోయిస్టు పార్టీని వీడారు. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే, తన అనుచరులతో కలిసి గడ్చిరోలి పోలీసుల ఎదుట ఆయన లొంగిపోవడం గమనార్హం. ఆయన లొంగుబాటుకు దారితీసిన కచ్చితమైన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.