సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో మండల రిసోర్స్ సెంటర్లకు అందించిన ప్రొజెక్టర్, స్క్రీన్, స్పీకర్ యూనిట్‌లను వినియోగిస్తూ జిల్లాలో మొట్టమొదటిసారిగా కొత్లాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలలో బుధవారం రాత్రి విద్యార్థినులకు ఇంగ్లీష్ మూవీని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరై విద్యార్థినులతో కలిసి సినిమాను తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో తొలిసారిగా ఈ రెసిడెన్షియల్ పాఠశాలలోనే సినిమా ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు.రె సిడెన్షియల్ పాఠశాల విద్యార్థినులకు వినోదంతో పాటు ప్రేరణాత్మక, స్ఫూర్తిదాయకమైన సినిమాలను స్క్రీన్ ద్వారా చూపించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ విధానంతో జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సినిమాలు కేవలం వినోదానికే కాకుండా, వాటి ద్వారా నీతి, విలువలు, మంచి నిర్ణయాలు నేర్చుకోవాలని విద్యార్థినులకు సూచించారు. చూసి మర్చిపోకుండా, చూసిన దానినుంచి స్ఫూర్తి పొందేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ భాషల సినిమాలను కూడా ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ విధంగా భాషలను అర్థం చేసుకొని, ఆయా భాషలపై విద్యార్థులకు పట్టు సాధించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని విద్యార్థులందరికీ కలెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు, రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.