అప్రమత్తతతోనే విపత్తుల్లో ప్రాణ రక్షణ _సీఎస్ రామకృష్ణారావు
ఈ నెల 22న విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్ – సీఎస్ రామకృష్ణారావు
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ డిసెంబర్ 19 :
ముందస్తు అప్రమత్తత ద్వారా విపత్తుల సమయంలో ప్రాణ నష్టాలను నివారించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌ను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు.శుక్రవారం ప్రకృతి విపత్తుల నిర్వహణ, వైపరీత్యాల నివారణ చర్యలపై జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ) అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిస్థితులను ముందుగానే అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్నారు.
వైపరీత్యాల సమయంలో సమాచార మార్పిడి అత్యంత కీలకమని, ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక సాధనాలను వినియోగించాలని సూచించారు. వర్షపాతం, ప్రాజెక్టుల నీటిమట్టం, నీటి విడుదల, వంతెనలు, రోడ్ల పరిస్థితులపై రియల్‌టైమ్ సమాచారం ప్రజలకు చేరవేయాలని అన్నారు. అత్యవసర సేవలకు సంబంధించిన టోల్‌ఫ్రీ నంబర్లపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. వైపరీత్యాల సమయంలో పారిశుధ్యం, వైద్య సేవలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు పూర్తి సహకారం అందిస్తాయని, అవసరమైతే హెలికాప్టర్ సేవలను కూడా వినియోగించవచ్చని తెలిపారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎన్‌డీఎంఏ అధికారులు విపత్తు నివారణకు సంబంధించిన పలు అంశాలను వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, జిల్లాలో విపత్తుల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ఈ నెల 22న నిర్వహించనున్న మాక్ ఎక్సర్సైజ్‌ను విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. గత వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పటికీ ముందస్తు అప్రమత్తత, స్పష్టమైన ప్రణాళికలు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాల సమన్వయంతో ఎటువంటి నష్టాలు లేకుండా ఎదుర్కొన్నామని వివరించారు. ఈ మాక్ ఎక్సర్సైజ్‌ను కామారెడ్డి జీఆర్ కాలనీ మరియు కామారెడ్డి పెద్ద చెరువు వద్ద ప్రత్యక్షంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు.
ఈ సమావేశంలో పరిశ్రమల, అగ్నిమాపక, పశుసంవర్ధక, సాగునీటి, పిహెచ్‌ఎం ఈడీ, పంచాయతీరాజ్, టీజీఎన్‌పీడీసీఎల్, పోలీస్, రవాణా, ఆర్డీవో, వైద్య ఆరోగ్య, మునిసిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.