జగిత్యాల మున్సిపాలిటీలో జరిగిన పలు అక్రమాలపై 18 మంది సభ్యుల విజిలెన్స్ టీం పలు సెక్షన్లలో ఫైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు : విజిలెన్స్ సీఐ వరుణ్
జగిత్యాల మున్సిపాలిటీలో జరిగిన పలు అక్రమాలపై విజిలెన్స్ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. విజిలెన్స్ సీఐ వరుణ్ తో సహా 18 మంది సభ్యులతో కూడిన విజిలెన్స్ టీం పలు సెక్షన్లలో ఫైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 2023 సంవత్సరం లో పలు అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఎంక్వైరీ చేపట్టినట్లుగా తెలుస్తుంది. మున్సిపాలిటీలో పలు సెక్షన్లకు సంబంధించిన సమాచారం కొరకే ఇదివరకే కొన్నిసార్లు లేఖలు రాసిన విజిలెన్స్ అధికారులు గత నెలలో జిల్లా కలెక్టర్ కు రిమైండర్ జారీ చేశారు. అయినప్పటికీ సోమవారం నేరుగా విజిలెన్స్ అధికారులే మున్సిపల్ లో తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది.డీజిల్ బిల్లులు, బల్దియ వాహనాల రిపేర్లు, ట్యాక్స్ వసూళ్లు, ట్రేడ్ లైసెన్స్ తదితర విషయాలపై ఆరా తీశారు. పట్టణంలోని గోవిందపల్లి సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయా నిర్మాణాలను పరిశీలించారని తెలిపారు. బల్దియాలోని రెవెన్యూ, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, అకౌంట్స్ విభాగాలకు సంబంధించి రికార్డులు పరిశీలించారని తెలిపారు.