ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఉప ఎన్నిక బరిలో అభ్యర్థిని నిలబెట్టే యోచనలో కూటమి ఉంది. వైకాపా అభ్యర్థిగా ఇప్పటికే విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేశారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు వైకాపాను వీడి కూటమిలో చేరారు. మొత్తం 822 మంది ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నికకు ఈనెల 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 6 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఆగస్టు 30న ఉపఎన్నిక జరగనుంది. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీ కృష్ణ.. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో పార్టీ మారాడనే అభియోగంతో అప్పట్లో అతనిపై వైకాపా అనర్హత వేటు వేయించింది. వంశీకృష్ణపై అనర్హత వేటుతో వచ్చిన ఉపఎన్నికలో కూటమి అభ్యర్థిని పోటీకి నిలబెట్టే యోచనపై విశాఖలో ఎమ్మెల్యేలు, ఎంపీ సీఎం రమేశ్ కీలక సమావేశం నిర్వహించారు. దీంతో విశాఖ జిల్లాలో రాజకీయ సందడి మొదలైంది..