ముదిరాజులారా మేల్కొనండి
– ఆర్థిక ,అక్షరాస్యతలో వెనబడిన జాతి ..
తన రాజకీయ వాటాను కోల్పోతుంది…
– కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్
ప్రశ్న ఆయుధం న్యూస్, అక్టోబర్ 01, కామారెడ్డి :
ఆర్థిక, అక్షరాస్యతలో వెనబడిన జాతి..తన రాజకీయ వాటాను కోల్పోతుందనీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి పెద్దమ్మ టెంపుల్ వద్ద జరిగిన సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. రాజ్యాంగ బద్దంగా రావల్సిన వాటా సాధించడంలో విఫలమైన జాతి తెలంగాణ ముదిరాజ్ జాతియే అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజులారా ఇకనైనా మేల్కొండని పిలుపు ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన, అత్యధిక సంఖ్యలో ఉన్న జాతి ముదిరాజ్ లని ఈ విషయాన్ని సకుటుంబ సర్వే తెలియజేసిందన్నారు. సామాజిక సర్వేనందు కూడా చాలామంది ముదిరాజ్ సోదరులు ముదిరాజ్ అనే పదాన్ని కాకుండా తెలుగు, తెనుగు, బంటు మొదలగు పేర్లను వాడటం వల్ల కొంతమంది ముదిరాజులు నమోదు కాలేదన్నారు.
27 శాతం జనాభా ఉన్న ముదిరాజులను
బీసీ. డీ నందు చేర్చడం వల్ల వెలకట్టలేనంత, పూరించలేనంత నష్టం జరిగిపోయిందన్నారు.
ఎనిమిది శాతం ఉన్న లంబాడ సోదరులు ఏడు శాతం రిజర్వేషన్లు పొందుతున్నారని, 10 శాతం జనాభా ఉన్న మాదిగ సోదరులు అంతే మొత్తంలో రిజర్వేషన్ పొందుతున్నారని, 6 శాతం ఉన్న మాల సోదరులు అంతే మొత్తంలో రిజర్వేషన్ పొందుతున్నారన్నారు. బీసీ’డీ’లో ఉన్న ముదిరాజులు 10 శాతం జనాభా ఉన్నప్పటికీ 1 ఒక శాతం కంటే తక్కువ రిజర్వేషన్ పొందుతున్నారన్నారు.
ముదిరాజులు మొట్టమొదటిగా విద్యకు దూరమై… వ్యసనాల బారినపడి, అస్తవ్యస్తమైన జీవితాన్ని గడుపుతూ జీవితాన్ని కోల్పోతూ, ఉద్యోగాలకు దూరమయ్యారని , విద్యా ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఆర్థిక వనరులు సృష్టించలేని ఒక జాతిగా మారిపోయిందని, ఆదాయాన్ని సమకూర్చలేని కులవృత్తి ఒకవైపు… భూమి లేకపోవడం, అడవి సంపదల పై ఆధారపడటం మరోవైపని వ్యవసాయ కూలీలుగా మిగిలిపోవటం వలన అత్యంత పేదలు కలిగిన జాతిగా అట్టడుగు స్థాయికి నెట్టి వేయబడిందన్నారు.
ప్రతి సంవత్సరం జరిగే నీట్(MBBS) పరీక్షలలో.. పదివేల ఎంబిబిఎస్ సీట్లలో కనీస సీట్లు ముదిరాజ్ జాతియులకు రావడం లేదనేది నగ్న సత్యమన్నారు. ఐఐటి, త్రిబుల్ ఐటీ, నెట్ వంటి ప్రతిష్టాత్మక సాంకేతిక కోర్సులలో కూడా సీట్లు సాధించలేక వెనుకబడి పోతున్నారని దీనికి కారణం ఆర్థిక స్థోమత లేకపోవడంతో పోటీ పరీక్షలను ఎదుర్కొన గలిగే నాణ్యమైన విద్యను అందుకోలేక పోవడం మనేది నిజమన్నారు. బాలికల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఉన్నత పాఠశాల స్థాయిలోనే చాలా మంది బాలికలు డ్రాప్ అవుట్ అవుతున్నారని కళాశాల స్థాయికి చేరటం లేదని, చేరినా కళాశాల విద్య పూర్తి చేయడం లేదని, సాంకేతిక విద్యలో మన గ్రామీణ ముదిరాజ్ బాలికలు కనీస సంఖ్య కూడా లేరని, పేదరికం దానికి తోడు అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను కలిగి ఉండి కనీస సౌకర్యాలు పొందలేని స్థితిలో ఉన్న అతిపెద్ద సమాజం ముదిరాజ్ జాతిని తెలిపారు.
కుల పెద్దలు నాణ్యమైన విద్యను ప్రభుత్వం ద్వారా అందించడానికి నిరంతరం కృషి చేయాలని, దాని కోసం ప్రభుత్వంపై పోరాటం చేయాలని, రిజర్వేషన్లు సాధించడంలో రాజీలేని పోరాటం చేయాలని, లేనట్లయితే రానున్న 10 సంవత్సరాల్లో ముదిరాజ్ జాతిలో ఉన్న ఉద్యోగులు రిటైర్ అయి, వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలుగా మారి పట్టణ ముదిరాజులు తక్కువ స్థాయి కలిగిన ఉద్యోగులుగా మారి బతుకునీడ్చే పరిస్థితి ఎంత దూరంలో లేదన్నారు.
ఇలాంటి పరిస్థితికి ఎవరిని నిందించాలని.. ముదిరాజ్ సంఘం అంటే పెద్దమ్మ తల్లి, పోచమ్మ తల్లి దేవాలయ నిర్మాణం ఉత్సవాలు నిర్వహించడం మాత్రమే కాదని .. ప్రభుత్వాన్ని కదిలించే విధంగా విద్య కోసం, ఉద్యోగాల కోసం, రాజకీయ వాటా కోసం ఆత్మగౌరవంతో బతకటానికి మన వాటాను సాధించటానికి వెన్ను చూపకుండా, మడిమ తిప్పకుండా ప్రలోభాలకు లొంగకుండా తానే నాయకుడు కావాలని ఆలోచన లేకుండా తన కుటుంబం కోసమే సంఘాలు నడపకుండా పేదవాడి కోసం కనీస అవసరాలు లేని కింది స్థాయి వారి కోసం పని చేయగలిగే నాయకులు యువకులు ముందుకు రావాలని “జాగో ముదిరాజ్”… జాతికి రావల్సిన వాటకై ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సభ్యులు పాల్గొన్నారు.