ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం

ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌ వరుస దాడులు పాలస్తీనా పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా గాజాలో టెల్‌అవీవ్‌ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 26 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈమేరకు పాలస్తీనా వైద్య అధికారులు వెల్లడించారు.

మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్‌ సరిహద్దులోని బీట్‌ లాహియాలో దాడులు జరిగాయి. దీంతో ప్రజలు స్థానభ్రంశం అయ్యారు. ఈక్రమంలో ఆయా ప్రజలు ఆశ్రయం పొందుతున్న ఓ ఇంటిపైన కూడా దాడి జరగడంతో 19 మంది మరణించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఉండటం గమనార్హం. మరోవైపు సెంట్రల్‌ గాజాలోని ఓ శరణార్థి శిబిరంపై దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు కమాల్‌ అద్వాన్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే, ఈ దాడికి సంబంధించి టెల్‌అవీవ్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు.

గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌ పై హమాస్‌ దాడి చేయడంతో సుమారు 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని మిలిటెంట్‌ సంస్థ బందీలుగా తీసుకెళ్లింది. దాంతో ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తోంది. టెల్‌అవీవ్‌ దాడులతో ఇప్పటివరకు 44వేల మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment