తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం:CBN

ఔర్ ఏక్ ధక్కా పునర్వైభవం పక్కా..

 మళ్లీ రేవంత్‌తో భేటీ..

తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం..

IMG 20240811 WA0079

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరమైతే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో మరోసారి భేటీ అవుతానని ప్రకటించారు. తెలంగాణలో త్వరలో గ్రామస్థాయి నుంచి పార్టీని పునర్నిర్మిస్తామని చెప్పారు. ఎన్టీఆర్‌ భవన్‌లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు మరియు రాష్ట్ర ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.పార్టీ సభ్యత్వ నమోదు, కింది స్థాయి నుంచి నాయకత్వాన్ని తయారు చేయడం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 2023లో ప్రత్యేక రాజకీయ పరిస్థితుల వల్ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదే పద్ధతిని లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించామన్నారు. ఇక్కడి మెజారిటీ ప్రజలు, పార్టీ అభిమానులు ఏపీకి వచ్చి ఎన్నికల్లో పనిచేయడంతోనే భారీ మెజారిటీతో గెలిచామని వివరించారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కూటమితో కలిసి 20 సీట్లు గెలిచామని, నాడు పార్టీకి 22 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు. 2019 ఎన్నికల తర్వాత ఏపీలో ఐదేళ్ల పాటు టీడీపీ ఎన్నడూ లేనంతగా ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా క్షేత్రస్థాయిలో పోరాడడం వల్లే తాజా ఎన్నికల్లో అఖండ విజయం సొంతమైందని చెప్పారు. తెలంగాణలో 40 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్నవారు ఉన్నారన్నారు. ఇక్కడ పార్టీని మళ్లీ శక్తిమంతం చేసుకోవాలని స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. సభ్యత్వ నమోదుపై శ్రద్ధ పెట్టాలన్నారు. దానివల్ల సుస్థిరమైన నాయకత్వం వస్తుందని చెప్పారు. తెలంగాణలో పార్టీకి పునర్వైభవం రావాలన్నారు. కార్యకర్తల నుంచి నాయకత్వాన్ని తయారు చేసుకోవాలని తెలిపారు. హైదరాబాద్‌ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం చేపట్టిన విధానాలను రాజశేఖర్‌రెడ్డి నుంచి రేవంత్‌రెడ్డి వరకు కొనసాగిస్తుండగా ఏపీలో మాత్రం గడిచిన ఐదేళ్లు విధ్వంసం జరిగిందని చంద్రబాబు చెప్పారు.

Join WhatsApp

Join Now