ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నాం
-తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగస్టు 15, కామారెడ్డి :
ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో గురువారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరిందని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఈ ప్రభుత్వం తోనే నెరవేరుతాయని ప్రజలు విశ్వసించారు. ప్రజలకు స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సామాజిక న్యాయం అందుబాటులో ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందంజలో ఉందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయ హస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమల అమలు చేసిందని పేర్కొన్నారు. ఇందిరమ్మ గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజా పాలన ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించుటకు, పరిపాలనను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లడంతో పాటు సమస్యల పరిష్కారంనకు ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం తీసుకువచ్చిందని, దాని పేరే ప్రజా పాలన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామస్థాయిలో, పట్టణ ప్రాంతాల్లో వార్డు స్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యలు నేరుగా విని సమస్యలు పరిష్కరించుట ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. జిల్లాలో మొదటి విడుతగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు 526 గ్రామపంచాయతీలలో, 80 పట్టణ వార్డులలో సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి ఆరు గ్యారంటీల కోసం రెండు లక్షల 94 వేల 799 దరఖాస్తులు, 13, 367 ఇతర సమస్యల గురించి వినతులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రజా పాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి జిల్లావ్యాప్తంగా అన్ని మండల పరిషత్ కార్యాలయాలు, పురపాలక సంఘాల కార్యాలయాలలో 33 ప్రజా పాలన సేవ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 30,866 లబ్ధిదారులు మళ్లీ సవరణల గురించి సందర్శించారని, 15,715 మంది వినియోగదారులు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ను, 23,119 విద్యుత్ సర్వీస్ కనెక్షన్ వివరాలు సరిచేసుకొని 2 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలో మొదటి విడుతలో లక్ష రూపాయల రుణం 49,540 కుటుంబాలకు 231.12 కోట్ల రూపాయల రుణమాఫీ అయిందని తెలిపారు. రెండో విడత 1,50,000 రుణం 24,816 మంది కుటుంబాలకు 211.71 కోట్ల రూపాయల రుణం మాఫీ అయినట్లు చెప్పారు. 2024 మార్చి నెలలో కురిసిన వడగళ్ల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచిందన్నారు. జిల్లాలో 10,328 ఎకరాల్లో వివిధ పంటలు నష్టపోయినట్లు తెలిపారు. జిల్లాలో నష్టపోయిన మొత్తం 9,107 రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున నష్టపోయిన రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా రూ.10.32 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని చెప్పారు. రైతు భరోసా పథకం కింద 2023 -24 యాసంగిలో మూడు లక్షల రైతుల ఖాతాలలో 260 కోట్ల 48 లక్షల 38 వేల రూపాయలు జమ చేసినట్లు పేర్కొన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం 30 లక్షల 89000 మొక్కలు నాటినట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు ఏర్పరిచి 22 కోట్ల రూపాయల నిధులతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 86,611 మంది విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 1,9,0436 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 24 గంటల పాటు నిరంతరంగా ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని తెలిపారు. గృహ జ్యోతి కింద 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తుందని చెప్పారు. ఇప్పటివరకు 1,56,670 గృహ విద్యుత్ కనెక్షన్లకు జీరో బిల్లులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం నాలుగు కోట్ల 84 లక్షల రూపాయల సబ్సిడీ అందజేసిందని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా జిల్లాకి మూడు కోట్ల 60 లక్షల 70 వేల రూపాయల విలువగల 247 పనులు మంజూరయ్యాయని వాటిలో 253 పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు కోటి లక్షల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. దీని ద్వారా మహిళలకు 59.65 కోట్ల రూపాయల లబ్ది జరిగిందని చెప్పారు. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2024- 25 సంవత్సరంలో ఇప్పటివరకు 5700 పనులు గుర్తించి లక్ష అరవై తొమ్మిది వేల 462 మంది కూలీలకు 36 లక్షల 51 వేల 471 పని దినాలు కల్పించినట్లు చెప్పారు. 70 కోట్ల 9 లక్షల రూపాయలు కూలీలకు డబ్బులు చెల్లించినట్లు పేర్కొన్నారు. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న వారి ఫోన్ వివరాలు తెలుసుకొని 559 విలువైన ఫోన్లు తిరిగి బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ విషయంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. షీ టీం, కుటుంబ స్నేహిత కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా మహిళల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మహిళల భద్రత, భరోసాతో ఉండే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జిల్లాను నేర రహిత సమాజంగా మార్చడానికి పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలతో పాటు మనందరి సహాయ సహకారాలు తోడు కావాలని కోరారు. రెండు లక్షల రుణం కలిగిన 91, 899 రైతులకు రూ.655 కోట్ల 37 లక్షల రూపాయలు మూడో విడత రుణమాఫీ అయినా చెక్కును తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారులకు, రైతులకు అందించారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన 1290 మంది మహిళలకు11.21 కోట్ల 45 వేల రూపాయలు బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరైనట్లు చెక్కును మహిళలకు అందించారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయలకు, సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించుటకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ, జిల్లా ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను తెలుపుతూ శకటాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఐకెపి, మహిళా శిశు సంక్షేమ , ఉద్యానవన , అగ్నిమాపక , ఆరోగ్య, విద్యాశాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. సమావేశంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ, మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియ, అధికారులు పాల్గొన్నారు.