*కడప జిల్లా…..*
*ఎంపిడిఓపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం…!*
* *రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్*
కడప, డిసెంబర్ : విధి నిర్వహణలో ఉన్న అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో సీఏ జవహర్ బాబుపై దాడి ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని.. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పీఆర్& ఆర్డీ, అటవీశాఖ మంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
శుక్రవారం జరిగిన దాడి ఘటనలో గాయపడి ప్రస్తుతం కడప రిమ్స్ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో సీఏ జవహర్ బాబును.. శనివారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ పరామర్శించారు.
ఈ సందర్భంగా బాధిత ఎంపిడివో ఆరోగ్య పరిస్థితిని ఉపముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎంపిడివో కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఎంపిడివో సీఏ జవహర్ బాబుపై జరిగిన దాడిని అప్రజాస్వామిక చర్యగా పరిగణిస్తున్నామని, ఎన్డీయే ప్రభుత్వంలో ఇటువంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు తావువ్వబోమన్నారు. బాధిత ఎంపీడీవోకు మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ వైద్యాధికారులను ఉపముఖ్యమంత్రి ఆదేశించారు. దాడి ఘటనలకు సంబంధించి.. నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లా కలెక్టర్లు డా.శ్రీధర్ చెరుకూరి, చామకూరి శ్రీధర్, ఉమ్మడి జిల్లాల ఎస్పీ విద్యాసాగర్, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, జెడ్పి సీఈవో ఓబులమ్మ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. రమాదేవి స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.