ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, జిల్లాలో వడగాలుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఏప్రిల్ 16 నుండి మే 15 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. వడదెబ్బ నివారణపై ఆయన పోస్టర్ను ఆవిష్కరించారు.
వేసవిలో నమోదవుతున్న తీవ్ర వడగాలుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. వడదెబ్బ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నివారించడానికి జిల్లా పరిపాలన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
జిల్లాలోని అన్ని శాఖల సమన్వయంతో తాగునీటి సరఫరా, చలివేంద్రాల ఏర్పాటు, ఆరోగ్య కేంద్రాల్లో మందులు, ORS నిల్వలు సిద్ధం చేయడం, బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, కార్మికుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దని, పుష్కలంగా ద్రవ పదార్థాలు తీసుకోవాలని, తేలికపాటి దుస్తులు ధరించాలని సూచించారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు.
బస్ స్టాండ్లు, మార్కెట్లు, పనిస్థలాల్లో తాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వడగాలుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, DMHO తదితరులు పాల్గొన్నారు.












