తెలంగాణ వ్యాప్తంగా రానున్న రెండు మూడు రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావును ఆదేశించి, అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని సూచించారు. రాష్ట్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
తీవ్రమైన ఎండల నేపథ్యంలో, ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి జిల్లా ఆసుపత్రుల వరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులను భారీగా అందుబాటులో ఉంచాలని, వడదెబ్బ బాధితులకు తక్షణ వైద్యం అందించేలా ప్రత్యేక వార్డులు, సిబ్బందిని సిద్ధం చేయాలని సూచించారు.
వేసవి కాలంలో తాగునీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు సీఎం గట్టిగా ఆదేశించారు. విద్యుత్ వినియోగం పెరిగినా లోడ్ షెడ్డింగ్ లేకుండా చూడాలని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో చలివేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ కూలీలు, నిరుపేదల విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.











