తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఎండలు కొనసాగుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. రానున్న మూడు రోజుల్లో ఇవి మరో 1 నుంచి 2 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండలతో పాటు వడగాలులు కూడా వీస్తాయని సూచించింది.
ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.
గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీయవచ్చని అంచనా. ఈ జిల్లాలకు 'ఎల్లో' హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ తో పాటు నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేయబడింది.











