నిజామాబాద్, జూలై 19
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా ఈశాన్య జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, హైదరాబాద్‌లోనూ సాయంత్రం నుంచి జల్లులు పడతాయని అంచనా వేశారు.
నేడు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు, ముఖ్యంగా రాత్రి వేళల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు.
అదేవిధంగా సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
రాజధాని హైదరాబాద్‌లో మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం కొనసాగనున్నప్పటికీ, సాయంత్రం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో జల్లులు లేదా మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు. రైతులు కూడా వర్ష పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ పనులు చేపట్టాలని సూచించారు.











