పాలీగ్రాఫ్ పరీక్షలో నిందితుడు ఏం చెప్పాడంటే?

వైద్యురాలి హత్యాచార ఘటన.. పాలీగ్రాఫ్ పరీక్షలో నిందితుడు ఏం చెప్పాడంటే?

IMG 20240826 WA0089

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలిపై హత్యాచార ఘటన నిందితుడు సంజయ్ కు ఇటీవల పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం అతడు కోల్కతాలోని ప్రెసిడెన్సీ జైల్లో ఉండగా అక్కడే ఈ లై డిటెక్టర్ పరీక్ష చేపట్టారు. ఇందులో నిందితుడు ఏం చెప్పారన్న వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. అయితే, పాలీగ్రాఫ్ పరీక్షలో నిందితుడ అసత్యం, పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. తాను వెళ్లేసరికే వైద్యురాలు చనిపోయిందని అతడు చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జే కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న ఈ దారుణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే సివిక్ వాలంటీర్ అయిన సంజయ్ రాయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ కోర్టు ఆదేశాలతో నిందితుడికి పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష సమయంలో సంజయ్ అనాలోచితంగా, ఆత్రుతగా ఉన్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. అధికారులు అడిగిన ప్రశ్నలకు అవాస్తవాలు, సరిపోలని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది.

 

దర్యాప్తు బృందం ఆధారాలు చూపించినప్పుడు.. ఆ సమయంలో తాను అక్కడ లేనని నిందితుడు చెప్పాడట. అంతేగాక, తాను సెమినార్ హాల్ కు వెళ్లేసరికి వైద్యురాలు అప్పటికే చనిపోయి ఉందని, భయంతో తాను అక్కడి నుంచి పారిపోయానని సంజయ్ చెప్పినట్లు సదరు కథనాలు వెల్లడించాయి. మరోవైపు, నిందితుడికి పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించే సమయంలో అతడి తరపు డిఫెన్స్ లాయర్ లేకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై న్యాయవాది స్పందిస్తూ.. పరీక్ష ఎక్కడ నిర్వహిస్తామన్నది అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఇది మానవహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆరోపించారు.కాగా.. వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడింది తానేనంటూ అంతకుముందు కోల్కతా పోలీసుల ఎదుట నిందితుడు నేరం అంగీకరించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి చెందిన వైద్యబృందం నిందితుడి మానసిక తీరును విశ్లేషించింది. ఘటన సమయంలో ప్రతీ నిమిషం చోటుచేసుకున్న విషయాలను నిందితుడు గుక్కతిప్పకుండా మొత్తం ఎపిసోడ్ ను వివరించాడని, అతడిలో పశ్చాత్తాపమే లేనట్లు కన్పించిందని కేసు దర్యాప్తులో పాల్గొన్న సీబీఐ అధికారి చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే, ఆ తర్వాత అతడిని కోర్టులో హాజరుపర్చగా.. సంచలన ఆరోపణలు చేశాడు. తానే తప్పు చేయలేదని, కావాలనే తనను ఇందులో ఇరికించారని న్యాయస్థానంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Join WhatsApp

Join Now