సిద్ధిపేటలో హైటెన్షన్.. వందల మంది పోలీసులు మోహరింపు.. ఏం జరుగుతోంది?
సిద్దిపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రైతు రుణమాఫీపై మాటల యుద్ధానికి దిగిన కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీ సమావేశాలకు పిలుపునివ్వడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. సిద్ధిపేటలో మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు నేతృత్వంలో సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఈమేరకు ఆయన 200 కార్ల కాన్వాయ్ తో సిద్ధిపేటకు బయల్దేరారు.అదే సమయంలో రుణమాఫీపై కాంగ్రెస్ మోసం చేసిందంటూ నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. గ్రామ స్థాయి నుంచి రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ నిరసనల్లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవలే హరీష్ రావు క్యాంప్ ఆఫీసు దాడి ఘటన నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా సిద్ధిపేటలో వందల మంది పోలీసులు మోహరించారు. రుణమాఫీపై వార్ నడుస్తోన్న వేళ ఇరు పార్టీలు సిద్ధిపేటలో సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయ ప్రధాన్యత సంతరించుకుంది. మరోవైపు.. కాంగ్రెస్ టార్గెట్ గా హరీష్ తీవ్ర విమర్శలు చేస్తుండటంతో.. తాజా సమావేశంలో మైనంపల్లి హనుమంత రావు ఏం మాట్లాడుతారు అనేది ఆసక్తి రేపుతోంది..