బనకచర్ల ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం.. ఎంతటి పోరాటానికి అయినా సిద్ధం
హైదరాబాద్: పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టును తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. బనకచర్లపై ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు సరైనవి కావని తెలిపారు. లోకేష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పోలవరం బనకచర్లకు పర్యావరణ అనుమతి లేదని, GRMB వ్యతిరేకించిందని గుర్తుచేశారు. ఇవాళ(శనివారం)తెలంగాణ సచివాలయంలో మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్ చేశారు.
తానే స్వయంగా తన లెటర్ హెడ్‌పై కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశానని స్పష్టం చేశారు. బనకచర్లను ఆపేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. బనకచర్లపై తమ స్టాండ్ క్లియర్‌గా ఉందని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని.. గులాబీ నేతలు పబ్లిసిటీ కోసం మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. బీఆర్ఎస్ గాలి మాటలు తప్ప వాస్తవం లేదని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టుకు తాము వ్యతిరేకమని.. ఎంతటి పోరాటానికి అయినా తాము సిద్ధమని ఉద్ఘాటించారు. కేంద్ర బీజేపీతో టీడీపీ పొత్తు ఉందని మంత్రి నారా లోకేష్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పోలవరం బనకచర్ల ఇల్లీగల్ ప్రాజెక్టు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.. కేపీ