గువ్వలతో వెళ్లే ఆ ఐదుగురు ఎవరు?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ఆసన్నమైన నేపథ్యంలో పొలిటికల్ జంపింగ్ లు మొదలైపోయాయి. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిపోతున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన బీజేపీ కార్యాలయానికి వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాంచందర్ ఓ సంచలన వ్యాఖ్య చేశారు. బీఆర్ఎస్ కు చెందిన ఓ ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరుతున్నారని ఆయన తెలిపారు. వారి చేరికల తేదీలనూ త్వరలోనే వెల్లడిస్తానని కూడా ఆయన చెప్పడం గమనార్హం.
బీఆర్ఎస్ కే చెందిన మరో మాజీ ఎమ్మెల్యే అబ్రహాం (అలంపూర్) కూడా ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరూ దళిత సామాజిక వర్గానికి చెందిన నేతలే. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉండి మరీ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరే నేతలు ఎవరబ్బా అని రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు. అయినా ఉరుము లేని పిడుగు మాదిరిగా రాంచందర్ రావు ఈ వ్యాఖ్య చేసినంతనే బీఆర్ఎస్ పెను కలవరమే రేగినట్లు సమాచారం. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న బీఆర్ఎస్ వాటి నుంచి బయటపడలేక ఆపసోపాలు పడుతోంది. అలాంటి సమయంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారంటే బీఆర్ఎస్ అధిష్ఠానానికి కలవరపాటు తప్పదు కదా.
ఈ ఐదుగురి ఎమ్మెల్యేల విషయంతోనే ముగించని రాంచందర్ రావు..మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో నేతలు ఇమడలేకపోతున్నారని, ఈ కారణంగానే ఇప్పటికే చాలా మంది ఆ పార్టీని వీడారని, ఇప్పుడు మరింత మంది బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధపడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదని గ్రహించిన మీదటే ఆ పార్టీ నేతలు పార్టీని వీడుతున్నారని చెప్పారు. గువ్వల బాలరాజు ఈ నెల 10న బీజేపీలో చేరుతున్నారని, ఇది చేరికల ఆరంభం మాత్రమేనని, స్థానిక సంస్థల ఎన్నికల ముందు మరింతమేర మంది బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి చేరనున్నారని, ఆ సంఖ్యను ఊహించడం కూడా కష్టమేనని ఆయన చెప్పారు.
రాంచందర్ రావు వ్యాఖ్యల్లో నిజం ఏ మేర ఉందో తెలియదు గానీ… ఆయన వ్యాఖ్యలు బీఆర్ఎస్ శిబిరంలో పెను కలవరాన్నే రేపాయి. అదే సమయంలో బీజేపీ నేతల్లో జోష్ ను నింపింది. రాంచందర్ చెప్పినట్లు స్థానిక సంస్థల ఎన్నికల ముందు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరితే మాత్రం… లోకల్ పోల్స్ లో కమల దళం సత్తా చాటడం ఖాయమనే చెప్పాలి. అధికార పార్టీగా కాంగ్రెస్ మెజారిటీ సాధించినా… గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో స్తానిక సంస్థలను బీజేపీ గెలుచుకోవడం ఖాయమన్న వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి.