Site icon PRASHNA AYUDHAM

గోపాల్ నగర్ కాలనీ పై ఎమ్మెల్యే , కార్పొరేటర్ కు ఎందుకు సీత కన్ను..?

IMG 20251023 WA0017

గోపాల్ నగర్ కాలనీ పై ఎమ్మెల్యే , కార్పొరేటర్ కు ఎందుకు సీత కన్ను..?

పార్కు స్థలాల కబ్జా విడిపించమని ఎందుకు అడగలేదు?

ప్రశ్నించిన యువ నాయకుడు గాదె శివ చౌదరి

ప్రశ్న ఆయుధం, అక్టోబరు 23: కూకట్‌పల్లి ప్రతినిధి

గోపాల్ నగర్ కాలనీలో గత ప్రభుత్వ హయాంలో కబ్జాకు గురైన పార్కు స్థలాలను విడిపించాల్సిందిగా డిమాండ్ చేస్తూ, అసోసియేషన్ సభ్యులుగా ఎమ్మెల్యేను కలిసిన కాలనీవాసులు ఒక లేఖ ఇచ్చి ఉంటే బాగుండేదని కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గాదె శివ చౌదరి అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

కూకట్‌పల్లి ఎమ్మెల్యేను గోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులు కలిసి తమ సమస్యలను పరిష్కరించమని కోరగా, దానికి ప్రతిస్పందనగా శివ చౌదరి ఈ ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ప్రజలకు, అసోసియేషన్ సభ్యులకు ఇచ్చిన వాగ్దానాలను వారికి గుర్తు చేయాల్సిందిగా అసోసియేషన్ సభ్యులకు సూచించారు.

వాగ్దానాలు గుర్తు చేయాలి.

ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, కేవలం అసోసియేషన్ సభ్యులమని చెప్పుకోవటం వలన ఉపయోగమేముంది ? అని ఆయన ప్రశ్నించారు. గోపాల్ నగర్‌లో కనీసం ఒక గుడి, బడి, ఆట స్థలము, పార్కు కూడా లేని విషయం ఎమ్మెల్యేకు, కార్పొరేటర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. ఉన్న సమస్యలను పరిష్కరించమని ఒత్తిడి చేయాల్సింది పోయి, మళ్ళీ ఇప్పుడు కొత్త సమస్యలు సృష్టించడం వలన ప్రయోజనం లేదన్నారు. గోపాల్ నగర్ కాలనీపై, ప్రజలపై ఎమ్మెల్యే, కార్పొరేటర్‌లకు నిజంగా ప్రేమ ఉంటే, గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం, కబ్జా అయిన పార్కు స్థలాలను విడిపించి ప్రజలకు అందించడం ద్వారా హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాలనీ కోసం ఇచ్చిన హామీలను అమలు పరచమని అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను అడగాలని సూచించారు. బి.ఆర్.ఆర్ నాయకులు, అసోసియేషన్ సభ్యులు హామీ విషయాలను గాలికి వదిలేసి, ఆ అంశాన్ని పక్కదారి పట్టించారని విమర్శించారు. కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ దృష్టికి, గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాలు, గోపాల్ నగర్ కాలనీ వాసులకు ఇచ్చిన తప్పుడు వాగ్దానాలను తీసుకెళ్తామని, పరిష్కారం కోసం కృషి చేస్తామని శివ చౌదరి స్పష్టం చేశారు. తమ తప్పుడు వాగ్దానాలపై తాము పోరాటం చేస్తామని, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందని గాదె శివ చౌదరి ఉద్ఘాటించారు.

Exit mobile version