Site icon PRASHNA AYUDHAM

మనకు ఒలంపిక్స్ పతకాలు ఎందుకు రావు

IMG 20240809 WA0405

మనకు ఒలంపిక్స్ పతకాలు ఎందుకు రావు .. ?

ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగస్టు 09, హైదరాబాద్ :

మనం పక్కోడి వాకిట్లో చెత్త వేసి
మన మంది మార్బలంతో వాడిదే తప్పు అని నిరూపించగల గొప్పవాళ్ళం
అందుకే మనకు ఒలంపిక్స్ పతకాలు రావు.

మనకు ఒలంపిక్స్ పతకాలు ఎందుకు రావు అంటే?

మనం మన పిల్లలను శ్రీ చైతన్య, నారాయణ లాంటి బందీ ఖానాలో అవిద్యాబుద్ధులు నేర్పించి,
సాఫ్ట్వేర్ ఇంజనీర్లను, డాక్టర్లను తయారుచేసి
అటు నుంచి అటే విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారంలో స్థిరపడ్డాం కాబట్టి
మనకు ఒలంపిక్స్ పతకాలు రావు.

మనకు ఒలంపిక్స్ పతకాలు ఎందుకు రావు అంటే?

చదువు తప్ప మరే ధ్యాస లేకుండా మన పిల్లల్ని కోళ్ల ఫారాలలో కోడి పిల్లల్లా కృత్రిమంగా పెంచుతున్నాం కాబట్టి మనకు ఒలంపిక్స్ పతకాలు రావు

మనకు ఒలంపిక్స్ పతకాలు ఎందుకు రావు అంటే?

చదువు తప్ప మరే పని చేసినా వాన్ని అంటరాని వాడిగానే చూస్తాం కాబట్టి మనకు ఒలంపిక్స్ పతకాలు రావు

మనకు ఒలంపిక్స్ పతకాలు ఎందుకు రావు అంటే?

మనకు మనం గెలవడంలో కన్నా పక్కవాడు ఓడడం లోనే ఆనందం ఉంది కాబట్టి మనకు ఒలంపిక్స్ పతకాలు రావు

మనకు ఒలంపిక్స్ పతకాలు ఎందుకు రావు అంటే?

మన పాన్ ఇండియా హీరోల చెక్క భజన చేసేందుకే మనకు సమయం సరిపోవడం లేదు కాబట్టి మనకు ఒలంపిక్స్ పతకాలు రావు

మనకు ఒలంపిక్స్ పతకాలు ఎందుకు రావు అంటే?

మన ఇంట్లో కూడు లేకపోయినా ఇండియా క్రికెట్ ఆడుతుంటే వికెట్ పడిపోకూడదు అనుకుంటాం చూడు ఇలా క్రికెట్ మన దేశ క్రీడలను శాసిస్తున్నంత కాలం మనకు ఒలంపిక్స్ పతకాలు రావు.

మనకు ఒలంపిక్స్ పతకాలు ఎందుకు రావు అంటే?

మనకు గెలిచిన వాడిదే ఇష్టం ఓడిపోయిన వాడిది అయిష్టం కాబట్టి మనకు ఒలంపిక్స్ పతకాలు రావు

మనకు ఒలంపిక్స్ పతకాలు ఎందుకు రావు అంటే?

పెద్ద కులపోడు ఆడితేనే అది ఆట కాబట్టి మనకు ఒలంపిక్స్ పతకాలు రావు

మనకు ఒలంపిక్స్ పతకాలు ఎందుకు రావు అంటే?

ప్రతిభ ఉన్నవాడిని పక్కనపెట్టి రాజకీయాలతో ఆటలు ఆడుతుంటారు కాబట్టి మనకు ఒలంపిక్స్ పతకాలు రావు

మనకు ఒలంపిక్స్ పతకాలు ఎందుకు రావు అంటే?

ఒలంపిక్స్ లో పతకం గెలిచిన వారిని ఒక గొప్ప క్రీడాకారిణిగా, క్రీడాకారుడిగా కాకుండా దేవుడుగా చూస్తాం కాబట్టి మనకు ఒలంపిక్స్ పతకాలు రావు గాక రావు .

వచ్చిన వాటితోనే సర్దుకోవాలి మరి…

Exit mobile version