Site icon PRASHNA AYUDHAM

కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీకి అనుమతి దొరికేనా..?

కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీకి అనుమతి దొరికేనా..?

-గవర్నర్ ఢిల్లీ టూర్ ముగిశాక ఏం జరగబోతుంది..?

ఒకవేళ కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీకి అనుమతిస్తే.. ఆయన అరెస్ట్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ గట్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం, అపోజిషన్ బీఆర్ఎస్ ఫైట్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఓ వైపు ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏసీబీ విచారణ కోసం గవర్నర్ అనుమతి కోరింది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు అమృత్ టెండర్లలో అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు కేటీఆర్.
ఇంకోవైపు సడెన్ గా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇలా తెలంగాణ పొలిటికల్ వ్యవహారాలన్నీ ఢిల్లీలో చక్కర్లు కొడుతుండటంతో అసలేం జరుగుతోందన్న దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. కేటీఆర్పై ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతి ఇస్తారా..? లేక అంతకంటే ముందే అమృత్ టెండర్ల విషయంలో కేటీఆర్ చేసిన ఫిర్యాదుపై కేంద్రం స్పందిస్తుందా.? ఇప్పుడివే తెలంగాణ పాలిటిక్స్ను మరింత హీటెక్కిస్తున్నాయి.
బీఆర్ఎస్ ఆరోపణలు
అమృత్ పథకం టెండర్లలో అవినీతి జరిగిందని.. మూసీ ప్రాజెక్టుతో పాటు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో కాంగ్రెస్ పెద్దలు అక్రమాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇలా బీఆర్ఎస్ ఆరోపణలు, ప్రభుత్వ లీకుల నేపథ్యంలో తెలంగాణ రాజకీయం హస్తినకు చేరడం ఆసక్తికరంగా మారింది. మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ పెద్దఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని రేవంత్ సర్కార్ ఆరోపిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఫార్ములా ఈ-కార్ రేస్కు నిధుల విడుదలలో..అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ 55 కోట్ల అవినీతికి పాల్పడ్డారని అంటోంది ప్రభుత్వం.
ఈ వ్యవహారంలో కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కు లేఖ రాసింది తెలంగాణ ఏసీబీ. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 17ఏ, 2018 ప్రకారం ఎమ్మెల్యే స్థాయి ప్రజా ప్రతినిధిని విచారించేందుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి. అందుకే నిబంధనల ప్రకారం కేటీఆర్ను విచారించేందుకు పర్మిషన్ కావాలంటూ గవర్నర్కు లేఖ రాసింది ఏసీబీ. తెలంగాణ ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాసి 15 రోజులు అవుతున్నా..ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేటీఆర్ విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రేవంత్ సర్కార్ రాసిన లేఖను గవర్నర్ అటార్నీ జనరల్కు పంపించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి అటార్నీ జనరల్ అభిప్రాయం వచ్చాకే కేటీఆర్ విచారణకు సంబంధించి గవర్నర్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజభవన్ వర్గాల సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ను టార్గెట్ చేస్తుంటే..బీఆర్ఎస్ డైరెక్టుగా సీఎం రేవంత్ రెడ్డినే పాయింట్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అమృత్ పథకం టెండర్లలో భారీ అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. అక్రమ మార్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి రూ.1,137 కోట్ల విలువైన అమృత్ టెండర్లను కట్టబెట్టారని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ వెళ్లి మరీ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు కేటీఆర్. కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి అమృత్ టెండర్లలో అక్రమాలపై విచారణ జరిపించి సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కేటీఆర్ ఇచ్చిన కంప్లైంట్పై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
-కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ నివేదిక!
కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్.. పరస్పర అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీకి వెళ్లడం ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణలో జరుగుతోన్న వ్యవహారాలన్నింటిపైనా గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా కేటీఆర్పై విచారణకు సంబంధించి రేవంత్ సర్కార్ కోరుతున్న అనుమతితో పాటు.. కేటీఆర్ ఆరోపిస్తున్న అమృత్ పథకం టెండర్లపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ రెండు అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీకి అనుమతిస్తారా అన్నది హాట్ టాపిక్గా మారింది.
ఒకవేళ కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీకి అనుమతిస్తే.. ఆయన అరెస్ట్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అమృత్ స్కీమ్ టెండర్లపై కేటీఆర్ ఫిర్యాదు మీద కేంద్రం ఎలా స్పందిస్తునేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒకవేళ విచారణ చేయాలనుకుంటే ఏ సంస్థతో దర్యాప్తునకు ఆదేశిస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాలకు తెరపడాలంటే గవర్నర్ ఢిల్లీ టూర్ ముగియాల్సిందే. మూడు రోజుల హస్తిన పర్యటన పూర్తి చేసుకుని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హైదరాబాద్ వచ్చాకే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కేటీఆర్ఏసీబీ విచారణకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా..అమృత్ టెండర్లపై దర్యాప్తు ఉంటుందా.. ఇప్పుడీ రెండు అంశాలే తెలంగాణ పొలిటికల్ సిచ్యువేషన్ను డిసైడ్ చేసేలా కనిపిస్తున్నాయి.

Exit mobile version