*ఇకనైనా అమెరికాపై మోజును భారతీయులు తగ్గించుకుంటారా ?*
వైట్ హౌస్‌లోకి అడుగు పెట్టగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లో బాగా చర్చల్లోకి వచ్చిన ఆర్డర్.. పుట్టుకతో వచ్చే పౌరసత్వ హక్కును మార్చేయడం. ఖచ్చితంగా అమెరికన్లకు పుట్టిన వారికే అమెరికా పౌరసత్వం వస్తుంది. ఇక గ్రీన్ కార్డు ద్వారా వచ్చే పౌరసత్వాలే పైనల్. వాటికి ఉన్న కోటా.. దరఖాస్తులతో పోలిస్తే వందేళ్లకు కూడా అవకాశం దక్కని వారు ఉంటారు.
ప్రపంచంలో ఏ దేశంలో అయినా తమ దేశంలో, తమ దేశ పౌరులకు పుట్టిన పిల్లలకే పౌరసత్వం ఇస్తారు. కానీ అమెరికాలో వందేళ్ల క్రితం ఎవరికి పుట్టినా అమెరికాలో పుడితే పౌరసత్వం ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించారు. దీని వల్ల వలసదారుల పిల్లలు, పౌరసత్వం లేని వాళ్లు, కాన్పు కోసం అమెరికా వెళ్లిన వాళ్లకు పుట్టిన పిల్లలకూ అమెరికా పౌరసత్వం వచ్చేది. ఇలా అమెరికా పౌరులుగా మారిన జనాభా చాలా మంది ఉంటారు. పిల్లలు అమెరికన్.. తల్లిదండ్రులు మాత్రం వీసాల మీద ఉండేవారు లక్షల్లోనే ఉంటారు. ఇప్పుడు అలాంటి అవకాశాలు లేకుండా పోతున్నాయి.
భారతీయులు అమెరికా మోజుపడటానికి.. అక్కడే ఉద్యోగం, పిల్లల్ని కనడానికి ప్రాధాన్యం ఇచ్చేది అక్కడ సెటిలైపోవడానికే. అందులో సందేహం లేదు. సొంత ప్రాంతానికి చుట్టపు చూపుగా వస్తారు కానీ.. అమెరికను వదిలేందుకు ఇష్టపడరు. కానీ ఇప్పుడు ఎప్పటికీ అక్కడ పరాయివారుగానే ఉండాల్సి ఇస్తుందన్న భావన వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఆసక్తి చూపించకపోవచ్చు. ఎప్పటికైనా ఇండియా తిరిగి రావాలన్న భావనతో.. కొంత మంది అదేదో ఇక్కడే చూసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చే చాన్స్ ఉంది. ట్రంప్ పౌరసత్వ మార్పుల వల్ల అమెరికాకు మేలు జరుగుతుందో.. ఇండియన్స్‌కు చేటు జరుగుతుందో కానీ.. బారత్ నుంచి మేధో వలస మాత్రం తగ్గే చాన్సులు ఉన్నాయి.