బతుకమ్మతో కవిత రీ ఎంట్రీ ఇస్తారా…?
తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ ఉత్సవాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. బతుకమ్మ పండుగ మొదలవుతుందంటే చాలు ఉద్యమ సమయం నుండి ఎమ్మెల్సీ కవిత హాడావిడి మొదలుపెడతారు. ప్రతిసారి తెలంగాణవ్యాప్తంగా జాగృతి తరపున ఉత్సవాలు చేస్తుంటారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ప్రత్యేక నిధులు కూడా జారీ చేసేది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. ఓ 10రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత వస్తారని మొదట కవిత టీం ప్రకటించింది. కానీ, ఆ తర్వాత ఎలాంటి ప్రకటన రాలేదు. ఎమ్మెల్సీగా ఉన్నా కవిత రాజకీయాలకు దూరంగా ఉంటారా… బ్రేక్ తర్వాత వస్తారా అన్నది స్పష్టత లేదు. కానీ బీఆర్ఎస్ ఓడిపోయాక వస్తున్న మొదటి బతుకమ్మ పండగ ఇది. గతంలో బతుకమ్మ పండుగ అంటే కవిత, కవిత అంటే బతుకమ్మ పండుగ అన్నంత ప్రచారం చేసుకున్నారు. మరి ఇప్పుడు కూడా అలాగే ఉంటుందా…? పార్టీ తరఫున లేదా జాగృతి తరఫున కవిత ఉత్సవాలు నిర్వహిస్తారా…? అన్న చర్చ ప్రారంభం అయ్యింది. కవిత బతుకమ్మ పండుగను నిర్వహిస్తే… కాంగ్రెస్ సహా అన్ని పార్టీల నుండి లిక్కర్ స్కాంకు ముడిపెట్టి విమర్శలు రావటం పక్కా. ఇందుకు కవిత వెనుకడుగు వేస్తారా? లేదా ఈ సంవత్సరం దూరంగా ఉంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా ఉండాలనుకుంటే నిర్వహిస్తారు లేదంటే దూరంగా ఉండిపోతారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.