ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని సుమారు 300కు పైగా చిత్రాల్లో కనిపించిన కొవ్వూరు మండలం కుమారదేవంలోని నిద్రగన్నేరు చెట్టుపై అధికార యంత్రాంగంతో పాటు ప్రవాసాంధ్రులు, పరిసర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మమకారం చూపుతున్నారు.చెట్టు పునరుద్ధరణకు ముందుకొస్తున్నారు. ఈనెల 5న నేలకొరిగిన చెట్టును తూర్పు గోదావరి జిల్లా అటవీ శాఖ అధికారి బి. నాగరాజు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఇక్కడి పరిస్థితిని జియాలజిస్టులకు నివేదించనున్నారు. వేరు వ్యవస్థ ద్వారా ఆధునిక పరిజ్ఞానం, రసాయనాలను వాడి పునరుద్ధరణకు చర్యలు తీసుకోనున్నారని తెలుస్తోంది. డిప్యూటీ రేంజ్ అధికారి వేణుగోపాల్, ఎఫ్బీవో కార్తిక్ స్థానిక పరిస్థితిని తెలుసుకున్నారు. నాయకులు వట్టికూటి వెంకటేశ్వరరావు, బోగవల్లి శివానందం, శ్రీనివాసరావు, బొర్రా తాతారావు చెట్టు గొప్పతనాన్ని వారికి వివరించారు.
పునరుద్ధరణపై దృష్టి…
సినిమా చెట్టు నేలకూలిందన్న సమాచారం పత్రికలు, టీవీ ద్వారా తెలుసుకుని ఓ ప్రవాసాంధ్రుడు స్పందించారని తెలుస్తోంది. ఆయనతో పాటు రాజమహేంద్రవరం, ఇతర ప్రాంతాలకు చెందిన స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, వృక్ష ప్రేమికులు కూడా చెట్టు పునరుద్ధరణకు సహకరిస్తామని చెప్పినట్లు సమాచారం..