Site icon PRASHNA AYUDHAM

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు: మహిళా శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి

IMG 20251223 195747

Oplus_16908288

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశాల మేరకు PM-SHRI పథకం కింద గుర్తింపు పొందిన 44 ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంరక్షణ– భద్రతపై అవగాహన కార్యక్రమాలను డిసెంబర్ 8 నుంచి 23 వరకు నిర్వహించామని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి (డీడబ్ల్యూఓ) లలిత కుమారి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా లలిత కుమారి మాట్లాడుతూ.. పిల్లల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని, అందుకే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో భద్రతా విన్యాసాలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మాక్ డ్రిల్లులు, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లపై విద్యార్థులకు అవగాహన కల్పించామని అన్నారు. అలాగే ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాల బారిన పడకుండా పిల్లలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. బాల కార్మికత్వం, బాల్య వివాహాలు, బాలలపై వేధింపులు చట్టరీత్యా నేరాలు. 18 సంవత్సరాల లోపు పిల్లలపై వేధింపులు జరిగితే పోక్సో చట్టం కింద కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. సేఫ్ టచ్, అన్‌సేఫ్ టచ్ విషయాలను పిల్లలు తప్పనిసరిగా తెలుసుకోవాలని లలిత కుమారి తెలిపారు. విద్యార్థులు నషాముక్త భారత్ అభియాన్‌ను ఆదర్శంగా తీసుకొని డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చదువుపై దృష్టి పెట్టి జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఎలాంటి సమస్య వచ్చినా 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వర్లు, డీసీపీఓ రత్నం, ఇతర జిల్లా అధికారులు, సిబ్బంది రామకృష్ణ, లింగం, విద్యార్థులు పాల్గొన్నారు.

Exit mobile version