బీసీ బిల్లుపై.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం
ఢిల్లీ: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్యర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్‌లో ధర్నా సైతం చేపట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై బీజేపీ నేతలు వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. బీసీ రిజర్వేషన్‌లో ముస్లింలను కలపొద్దని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముస్లింలు లేకుండా అయితేనే బీసీ బిల్లుకు కేంద్రప్రభుత్వం అమోదిస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే ఈ విషయంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి.. బీసీ రిజర్వేషన్లపై మాట్లాడారు. అదే సమయంలో బీజేపీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీసీ బిల్లు గురించి మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు.
భారతదేశంలో అత్యధికంగా బీసీ బిడ్డలు ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలకు సిగ్గుందా.. పార్లమెంట్‌లో బీసీ బిల్లుకు ఎందుకు ఆమోదం తెలపడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో ప్రజలను కలిసి కష్టాలు తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు. బీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాలని కోరారు. బీసీ బిల్లుపై మోదీ ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని నిలదీశారు ఎమ్మెల్సీ విజయశాంతి.
ఈబీసీ రిజర్వేషన్లు ఎలా అమలు చేశారు: ఎమ్మెల్సీ విజయశాంతి
పార్లమెంట్‌లో బీసీ బిల్లుకు ఆమోదం తెలిపితే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అంటున్నారని.. మరి ఈబీసీ రిజర్వేషన్లు ఎలా అమలు చేశారని ఎమ్మెల్సీ విజయశాంతి ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నేతలకు, మోదీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీసీలను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బీసీల కోసం ముందడుగు వేసిందని ఉద్ఘాటించారు. మోదీకి బీసీ బిడ్డలు ఎవరూ ఓటు వేయరని తెలిపారు. బీసీ బిల్లుకు కేంద్ర మద్దతు తెలపాలని ఎమ్మెల్సీ విజయశాంతి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్‌కి చిత్తశుద్ధి లేదు: పాయల్ శంకర్
కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కి లేదని బీజేపీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రోజే తాము చెప్పామని గుర్తుచేశారు. బీసీ బిల్లులో ముస్లిం రిజర్వేషన్ ఉంటే కేంద్ర ప్రభుత్వం.. ఈ బిల్లును అమలు చేయడానికి ఒప్పుకోదని స్పష్టం చేశారు. బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని కాంగ్రెస్ ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు సంవత్సరానికి రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారని.. రెండు సంత్సరాలు అయిన ఒక్క పైసా కూడా ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు. ఇవాళ(బుధవారం) బీజేపీ కార్యాలయంలో పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడారు.
రూ.20 వేల కోట్లు బీసీలకు ఇవ్వడానికి ఏ షెడ్యూల్ అడ్డువస్తుందో చెప్పాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిలదీశారు. రాహుల్‌గాంధీ దేశం అంతా తిరుగుతూ తెలంగాణ బీసీలకు 42శాతం అమలు చేస్తున్నామని గొప్పగా చెబుతున్నారని… కానీ తెలంగాణలో ఎక్కడ ఎప్పుడు అమలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్‌కు ఏనాడూ బీసీని ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదని నిలదీశారు. ముస్లింలకు పదిశాతం కట్టబెట్టడానికే కాంగ్రెస్ డ్రామాలు చేస్తోందని ఆక్షేపించారు. బీసీలకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అందుకే అక్బరుద్దీన్, అసదుద్దీన్ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. కేంద్ర కేబినెట్‌లో కాంగ్రెస్ ఏనాడూ 20 మంది బీసీలకి మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా 42శాతం బీసీల కోసం కాదని విమర్శించారు. ముస్లింలకి పదిశాతం ఇచ్చి బీసీల హక్కులను కాంగ్రెస్ నేతలు దోచేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రపూరిత ఆలోచన మానుకోవాలని హితవు పలికారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో బీసీ బిల్లు గురించి కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు..