*ప్రపంచ జనాభా దినోత్సవం 2025: జనాభా నియంత్రణపై మేడ్చల్‌లో అవగాహన కార్యక్రమం*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 11
మేడ్చల్ జిల్లా అంతాయిపల్లిలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రపంచ జనాభా దినోత్సవం – 2025ను పురస్కరించుకుని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డా. సి. ఉమా గౌరీ ముఖ్య అతిథిగా హాజరై సభను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డా. ఉమా గౌరీ మాట్లాడుతూ, “జనాభా పెరుగుదల అనేది కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా, అది మన భవిష్యత్తుపై మన బాధ్యతను తెలియజేస్తుంది. సమర్థవంతమైన కుటుంబ నియంత్రణ ద్వారా మాతా-శిశు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే గర్భనిరోధక సాధనాల వినియోగం వ్యక్తిగత నిర్ణయాధికారం మరియు జీవిత నాణ్యతను ప్రతిబింబిస్తాయి” అని వివరించారు.
ఆమె అభిప్రాయపడుతూ, జనాభా వృద్ధి వనరులపై ఒత్తిడిని కలిగిస్తూ, ఆహారం, నీరు, ఆరోగ్యం, విద్య వంటి ప్రాథమిక అవసరాలపై ప్రభావం చూపుతోందని, దీని వలన నిరుద్యోగం, పేదరికం వంటి సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆరోగ్య విద్యపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖలో విశిష్ట సేవలు అందించిన పలువురు ఉద్యోగులకు మెరిట్ సర్టిఫికెట్లు మరియు మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో జనాభా నియంత్రణపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఉంది.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి మరియు కీసర డివిజన్ ఉప జిల్లా వైద్యాధికారులు డా. శోభ, డా. సత్యవతి, జిల్లా ప్రోగ్రామ్ అధికారులు డా. చంద్రకళ, డా. గీత, డా. మల్లేశ్వరి, డా. కౌశిక్, సూపర్వైజర్లు ఎర్రగిన్నల విజయ్ కుమార్, లింగాల అక్షయ్ కుమార్, కమల్, అలాగే జిల్లా పిహెచ్‌సిలు, యుపిహెచ్‌సిలకు చెందిన వైద్యాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.