బిచ్కుంద మండలంలో
బిచ్కుంద మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గ్రామపంచాయతీ కార్మికులు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే అందించాలంటూ రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సురేష్ గొండ మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్మికులు ఆరోగ్యం, పరిశుభ్రత పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నారని, కానీ ఇప్పటికీ ఐదు నుంచి 10 నెలల వరకు వేతనాలు అందించకపోవడం దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ దసరా పండుగకి పెండింగ్ వేతనాలను చెల్లించాలనీ, అదేవిధంగా దసరా బోనస్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీసం 26,000 రూపాయల వేతనం, ఆరోగ్య రక్షణ కార్డు, ఇన్సూరెన్స్ సౌకర్యం, ఉద్యోగ భద్రత వంటి న్యాయమైన అర్హతలు కల్పించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మిక సంఘం సభ్యులు, రుప్ సింగ్, సాయి, సుశీల బాయ్, శంకర్, పురేందర్, లింగురాం, భూమయ్య, లక్ష్మి, గంగవ్వ తదితరులు పాల్గొన్నారు.