మెట్‌పల్లిలో పసుపు రైతుల ఆందోళన.. జాతీయ రహదారిపై బైఠాయింపు
మద్దతు ధర కోసం రైతు ఐక్యవేది ఆధ్వర్యంలో పసుపు రైతులు మంగళవారం రోడ్డెక్కారు. మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ నుంచి ర్యాలీగా పాత బస్టాండ్ చేరుకున్నారు.
63వ జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. పసుపునకు క్వింటాలకు పదిహేను వేల రూపాయల మద్దతు ధర ప్రకటించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎంఐఎస్ పథకం కింద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి నేరుగా పసుపును కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
పసుపు రైతులకు మద్దతు ధర కల్పిస్తామని ఎన్నికల ముందు వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలన్నారు. సంబంధిత అధికారులు వచ్చేవరకు రాస్తారోకోను విరమించేది లేదని రైతులు భీష్మించి కూర్చున్నారు. ఆర్డీవో శ్రీనివాస్ అక్కడ చేరుకుని రైతులతో మాట్లాడారు. వారి నుంచి వినతిపత్రం తీసుకోవడంతో రైతులు తమ ఆందోళన విరమించారు.