రామాలయం తరఫున ‘భద్రాద్రి దివ్యక్షేత్రం’ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ రమాదేవి మంగళవారం ప్రకటించారు. ఇందులో భద్రాచలంలోని ఉత్సవాల విశేషాలను, పూజల సమస్త సమాచారాన్ని అప్‌లోడ్ చేయనున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులకు ఇక్కడి రోజువారీ క్రతువుల గురించి వివరించే వెసులుబాటు లభించింది. ఇప్పటికే ఇది ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. భద్రాచలం రాములవారికి రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 1300 ఎకరాల భూమి ఉంది. సుమారు 68 కిలోల బంగారం, 980 కిలోల వెండి ఉంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో 20 నిమిషాల నిడివి ఉన్న ఏవీని తయారు చేశారు. దీన్ని త్వరలో భద్రాద్రి దివ్యక్షేత్రం యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. దీంతో పాటు ఆలయంలో నిర్వహించిన పలు ఉత్సవాల వీడియోలను సైతం ఇందులో పొందుపర్చనున్నారు.