వైఎస్ భారతి పేరు ఎందుకొస్తోంది..?

వైఎస్ భారతి పేరు ఎందుకొస్తోంది?

లిక్కర్ స్కామ్‌లో ప్రధాన కుట్రదారుల్లో జగన్ తో పాటు భారతి రెడ్డి కూడా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ సోషల్ మీడియాలో చేసిన ప్రకటన సంచలనంగా మారుతోంది. సీఐడీ సిట్ దర్యాప్తులో ఇప్పటి వరకూ వైఎస్ భారతి ప్రమేయం గురించి ఏమైనా బయటపడిందో లేదో స్పష్టత లేదు. కానీ ఇప్పటి వరకూ వివిధ నిందితులకు సంబంధించి రిమాండ్ రిపోర్టులు, ప్రాథమిక చార్జిషీటులో వైఎస్ భారతి ప్రమేయం గురించి ఏమీ చెప్పలేదు. మాణిగం ఠాగూర్ ఎందుకలా చెప్పారు ?

బాలాజీ గోవిందప్ప.. భారతి ఆర్థిక వ్యవహారాలు చూసే ఆడిటర్

ఈ లిక్కర్ స్కాం వ్యవహారంలో అరెస్టు అయిన ఓ వ్యక్తి బాలాజీ గోవిందప్ప. భారతి సిమెంట్స్ ఆర్థిక వ్యవహారాలు చూస్తారు. వైఎస్ భారతి కి చెందిన ఆర్థిక వ్యవహారాలు అన్నీ ఆయనే చూస్తారని అంటారు. ప్రస్తుతానికి లిక్కర్ స్కామ్‌లో వైఎస్ భారతికి ఎక్కడైనా సంబంధం ఉందని అనిపిస్తే.. అది బాలాజీ గోవిందప్ప వ్యవహారంతోనే. అయితే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ మాత్రం.. జగన్ , భారతి ఇద్దరు కలిసి చేసిన స్కామ్ అని గట్టిగా వాదిస్తున్నారు. అక్కడే దర్యాప్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగా భారతి పాత్రను పక్కన పెడుతున్నాయా అన్న సందేహం వస్తోంది.

వైఎస్ భారతి ప్రమేయంపై ఆధారాలు దొరకలేదా?

సీఎం క్యాంపు ఆఫీసులో సీఎంగా జగన్మోహన్ రెడ్డి తో పాటు వైఎస్ భారతి కూడా సమానంగా పవర్ చూపించేవారని.. కీలక నిర్ణయాల విషయంలో ఆమె మాటే నెగ్గేదని వైసీపీలో కొన్నాళ్లుగా ప్రచారం ఉంది. విశాఖ భూ వ్యవహారాలతో పాటు … రుషికొండ ప్యాలెస్ నిర్మాణం మొత్తం భారతి పర్యవేక్షణలోనే జరిగిందని ఆనాటి అధికారులకు తెలుసు. లిక్కర్ స్కామ్ లో డబ్బులు ఎలా రూటింగ్ చేయాలో బాలాజీ గోవిందప్పను ముందు పెట్టి.. భారతినే కథ నడిపించారని మాణిగం ఠాగూర్ అనడం వెనుక.. ఇదే కారణం అయి ఉండవచ్చు.

వివేకా హత్య కేసులోనూ భారతి పేరు ప్రచారం

వైఎస్ వివేకా హత్య గురించి మొదటగా వైఎస్ భారతికే తెలిసిందని సీబీఐ అధికారులు తమ రిపోర్టులో పరోక్షంగా చెప్పారు . తెల్లవారు జామున.. వివేకా హత్యకు గురయ్యారని ఎవరికీ తెలియని సమయంలో …జగన్ కొంత మంది వ్యక్తులతో ఇంట్లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఆయన సమయంలో భారతి తన పీఏ ద్వారా పైకి పిలిచి వివేకా చనిపోయిన విషయం చెప్పారు. అదే విషయాన్ని జగన్ కిందకు వచ్చి..తనతో సమావేశంలో ఉన్న వారికి చెప్పారు. వివేకానందరెడ్డి ఇక లేరని చెప్పారు. అప్పటికి విషయం ఎవరికీ తెలియదు. అందుకే వివేకా కేసులోనూ ఆమె పేరు ప్రచారంలోకి వచ్చింది.

ఇప్పుడు లిక్కర్ కేసులోనూ భారతిరెడ్డి ప్రమేయం గురించి మెల్లగా బయటకు వస్తోంది. దర్యాప్తు సంస్థలు ఆమె ప్రమేయాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నాయా లేకపోతే.. ఊహాగానాలేనా అన్నది తేలాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment