Headlines :
-
వైఎస్ విజయమ్మ కారు ప్రమాదంపై ఘాటు స్పందన
-
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన విజయమ్మ
-
రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయడం అన్యాయమని విజయమ్మ వ్యాఖ్యలు
-
ప్రజాస్వామ్యాన్ని కించపరచే చర్యలకు నిలువెత్తు ప్రతిస్పందన
-
విపక్షాలకు విజ్ఞప్తి: అసత్యాలను ప్రచారం చేయడం మానుకోవాలని
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్, పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల మధ్య సాగుతున్న ఆస్తుల యుద్ధం మధ్యలో వారి ప్రత్యర్థులు తల్లి విజయమ్మ కారు ప్రమాదాన్ని తెరపైకి తెచ్చారు. జగన్ పై బురదజల్లే క్రమంలో గతంలో తల్లి విజయమ్మ కారుకు ఆయనే ప్రమాదం చేయించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై విజయమ్మ ఇవాళ తొలిసారి స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసారు
రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తనను తీవ్రంగా కలచివేస్తోందని విజయమ్మ తెలిపారు. కొంతమంది సోషల్ మీడియాలో లేనిపోని అసత్య కథనాలు ప్రచారం చేయడం చూస్తుంటే తనకు తీవ్ర మానసిక వేదన కలుగుతోందన్నారు. తనను అడ్డం పెట్టుకుని చేస్తున్న నీచ, నికృష్ట రాజకీయాలను ఖండించకపోతే ప్రజలు నిజం అని అనుకుని నమ్మే ప్రమాదం ఉందని విజయమ్మ తెలిపారు.
వాస్తవాలను, కొంతమంది దుర్మార్గపు ఉద్దేశాలని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఈ వివరణ ఇస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం తన కారుకు ప్రమాదం జరిగిందని ప్రచారం మొదలుపెట్టారని, ఎప్పుడో జరిగిన కారు ప్రమాదాన్ని తన కుమారుడు జగన్ కు ముడిపెట్టి ప్రచారం చేయడం జుగుప్సాకరం అన్నారు. రాజకీయంగా లబ్ది పొందాలనే ప్రయత్నాలు అత్యంత దుర్మార్గం అన్నారు.
అమెరికాలో ఉన్న తన మనవడి దగ్గరికి వెళ్తే కూడా తప్పుగా చిత్రీకరించి భయపడి తాను విదేశాలకు వెళ్లిపోయినట్లు దుష్ప్రచారం చేయడం అత్యంత నీతిమాలిన చర్య అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారి ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఇలా దుష్ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించాలనే విధానం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. ఈ నీచ సంస్కృతిని ఎటువంటి పరిస్ధితుల్లోనూ సహించేది లేదన్నారు.
ఇక ముందు ఇలాంటి దుష్ప్రచారాలను, వ్యక్తిత్వ హనన వైఖరిని ఆపితే మంచిదని ప్రత్యర్థులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ వికృత చేష్టలను గమనిస్తూనే ఉన్నారని, సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెప్తారని విజయమ్మ పేర్కొన్నారు. ఇకపై ఇటువంటి లేనిపోని అసత్యాలను ప్రచారం చేస్తే తాను ఊరుకోదలచుకోలేదన్నారు.