టెక్నాలజీతో ఎలాంటి కేసునైనా ఛేదించవచ్చు.. వైఎస్ వివేకా కేసే నిదర్శనం: చంద్రబాబునాయుడు

టెక్నాలజీతో ఎలాంటి కేసునైనా ఛేదించవచ్చు.. వైఎస్ వివేకా కేసే నిదర్శనం: చంద్రబాబునాయుడు

టెక్నాలజీతో ఏపీని నేర రహిత రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు

వివేకా హత్య కేసులో గూగుల్ టేకౌట్‌తో వాస్తవాలు బయటపడ్డాయని వెల్లడి

గంజాయి, అరాచకాలకు పాల్పడితే తాటతీస్తామని తీవ్ర హెచ్చరిక

ఏపీ పోలీస్, అమెరికా సంస్థ సంయుక్తంగా ‘ఏఐ ఫర్ ఏపీ పోలీస్’ హ్యాకథాన్

సిలికాన్ వ్యాలీ తరహాలో ఏపీలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తామని ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు శాఖకు దిశానిర్దేశం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్లిష్టమైన కేసులను సైతం ఎలా ఛేదించవచ్చో వివేకానంద రెడ్డి హత్య కేసే నిరూపిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరిలో నిర్వహించిన ‘ఏఐ ఫర్ ఏపీ పోలీస్-హ్యాకథాన్-2025’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నా ఆయన, శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

గూగుల్ టేకౌట్‌తో బయటపడ్డ నిజాలు

గత ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా చంద్రబాబు తిప్పికొట్టారు. “వివేకా హత్య కేసులో నాపై బురద చల్లాలని చూశారు. నారాసుర రక్త చరిత్ర అంటూ దారుణంగా విమర్శించారు. కానీ, సీబీఐ దర్యాప్తులో గూగుల్ టేకౌట్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడటంతోనే అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి” అని ఆయన గుర్తు చేశారు. తప్పులు చేసి, వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించే వారి ఆటలు ఇక సాగవని, సాంకేతిక పరిజ్ఞానంతో అలాంటి వారిని సులభంగా పట్టుకోవచ్చని అన్నారు. ఇటీవల తెనాలిలో మాజీ ముఖ్యమంత్రి రౌడీ షీటర్లకు సంఘీభావం తెలపడాన్ని, పల్నాడు జిల్లా పర్యటనలో జరిగిన ఘటనలను ఆయన ప్రస్తావిస్తూ విమర్శించారు.

అరాచకాలు చేస్తే తాటతీస్తాం

రాష్ట్రంలో నేరాలకు పాల్పడే వారిని కఠినంగా అణచివేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. “ఇష్టానుసారంగా గంజాయి అమ్మడం, పండించడం, సేవించడం వంటివి చేస్తే సహించేది లేదు. ఆడబిడ్డల జోలికి వస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు. అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు” అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నిఘా పెంచుతామని, తప్పు చేసిన వారిని ఆధారాలతో సహా పట్టుకుంటామని స్పష్టం చేశారు.

క్వాంటం వ్యాలీతో తెలుగు వారి సత్తా

రాష్ట్ర యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రపంచస్థాయిలో రాణించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. “గతంలో ఐటీని ప్రోత్సహించాం. ఇప్పుడు క్వాంటం వ్యాలీ ద్వారా తెలుగు వారి సత్తాను ప్రపంచానికి చాటబోతున్నాం. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఎలాగో, ఇక్కడ క్వాంటం వ్యాలీ అలా ఉండాలి” అని ఆయన తన దార్శనికతను వివరించారు. ‘స్థానికంగా పనిచేస్తూ, ప్రపంచస్థాయిలో ఆలోచించాలి’ అనే నినాదంతో ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు.

నేరాల నియంత్రణ, వేగవంతమైన దర్యాప్తు కోసం ఏపీ పోలీస్ విభాగం, అమెరికాకు చెందిన ‘4 సైట్ ఏఐ’ సంస్థలు సంయుక్తంగా ఈ హ్యాకథాన్‌ను నిర్వహించాయి. ఇందులో 160కి పైగా బృందాలు పాల్గొన్నాయి. ముఖ్యమంత్రి ఈ బృందాలతో ముచ్చటించి, వారి ఆలోచనలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment